కరెంట్ తీగ : రివ్యూ
పార్వతీపురం అనే గ్రామంలో ఉండే శివరామ రాజు (జగపతి బాబు) ముగ్గురు కూతుళ్ళు చిన్నప్పుడు జరిగిన గొడవలో వీర్రాజు(సుప్రీత్) చెవిని శివరామ రాజు కోసేస్తాడు అప్పుడే వీర్రాజు ఎప్పటికయినా తన కూతుల్లలో ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని అలా జరిగితే శివరామరాజు చెవి కోస్తానని ఛాలెంజ్ చేస్తాడు. అప్పటి నుండి తన కూతుళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు శివరామ రాజు. ఇదే గ్రామంలో రాజు(మంచు మనోజ్) అనే యువకుడు ఉంటాడు. ఫిలోసఫీ లో పట్టా పొందిన ఈ యువకుడు ఏ పని చెయ్యకుండా ఆ ఊర్లో యువతతో కలిసి వి.ఐ .పీ అనే సంఘాన్ని స్తాపిస్తాడు. సన్నీ(సన్నీ లియోన్) ని ప్రేమిస్తున్న రాజు ఆమె కి ప్రేమ రాయబారంగా కవిత(రకుల్ ప్రీత్ సింగ్)ని వాడుకుంటాడు. కాని కొన్ని రోజుల తరువాత తను నిజంగా ప్రేమించేది కవితని అని తెలుసుకుంటాడు రాజు.. ఆ తరువాత ఎం జరిగింది? ఈ విషయం తెలిసాక శివరామ రాజు ఎలా స్పందించాడు? అనేది మిగిలిన కథ...
మంచు మనోజ్ నటన చాలా బాగుంది కాని కొన్ని సన్నివేశాలలో అవసరానికి మించి నటించారు, ఫైట్స్ విషయంలో ఆయన్ని మెచ్చుకొని తీరాల్సిందే చాలా కష్టపడుతున్నారు కాని కొన్ని చోట్ల అవసరానికి మించి ప్రతిభ కనబరుస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ కాస్త సంయమనం పాటించి సన్నివేశానికి సరిపోయే నటన కనబరిస్తే అతనిలోని మంచి నటుడు బయటకి వస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ నటన గురించి చెప్పుకోడానికి ఎం లేదు కాని ఆమె అందాల ఆరబోత పాళ్ళు కొంచెం పెంచింది. ఎమోషనల్ సన్నివేశాలు వచ్చినప్పుడు రకుల్ ప్రీత్ పూర్తిగా తేలిపోయింది.. జగపతి బాబు నటన అంతగా ఆకట్టుకోలేదు, కాని ఈ పాత్రకి కావలసిన న్యాయం చేసాడు.. సన్నీ లియోన్ ఉన్నంతసేపు అందాలతో ఆకట్టుకుంది.. వెన్నెల కిషోర్ , రఘు బాబు, పృథ్వి, జీవా, సుప్రీత్ వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.. విలన్ పాత్రలు పోషించా వారి గురించి చెప్పుకునే స్థాయిలో కూడా వారి పాత్రలు ఉండదు..
తమిళంలో వచ్చిన వరుతపడాద వాలిబర్ సంఘం అనే సినిమాకి ఇది రీమేక్ అందులో ఉన్న కథనే తీసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. అదనపు ప్రతినయకుడిని తీసుకురావడం, హీరోయిన్ చేత అవసరానికి మించి అందాలు చూపించడం. అవసరమే లేని చోట ఫైట్ లు పెట్టించడం లాంటి "ఎక్స్ట్రా" పనులు చేసారు. అక్కడ ఎలా ఉందో అలానే కథనం రాసుకొని ఉంటె ఈ చిత్రం కాస్త బాగుండేది ఏమో, కాని చాలా మార్పులు చేసేసి అనవసరమయిన సన్నివేశాలను జత చేసేసి ప్రేక్షకుడిని చిరాకు పెట్టించేసారు. దర్శకుడిగా జి నాగేశ్వర్ రెడ్డి గతంలో సీమ శాస్త్రి వంటి చిత్రాలలో కామెడీ బాగా పండించారు కాని ఈ చిత్రం విషయంలో తేలిపోయారు. సతీష్ సినిమాటోగ్రఫీ అంతంతమాత్రమే ఉంది, హీరోయిన్ ని మరియు సన్నీ లియోన్ ని మాత్రమే అందంగా చూపించగలిగారు. మాటలు రాసిన శ్రీధర్ సీపాన ప్రాస కోసం చాలా దూరం పరిగెత్తి అలిసిపోయారు, పవర్ ఫుల్ సన్నివేశాల వద్ద కూడా అయన డైలాగ్స్ పేలవంగా ఉండటంతో సన్నివేశాలు తేలిపోయాయి.. అచ్చు అందించిన సంగీతంలో పాటలు వినడానికి బాగున్నా కూడా తెర మీదకి వచ్చేసరికి ఆకట్టుకోలేదు నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశం ఎలా ఉన్నా సరే నేపధ్య సంగీతం బాగుంది అనిపించుకునేలా ఇచ్చారు. ఎడిటర్ మొదటి అర్ధ భాగం బానే కట్ చేసిన రెండవ అర్ధ భాగం చాలా సన్నివేశాలను క్షమించి వదిలేసారు, అంతే కాకుండా ఫైట్ లు కూడా బాగా పొడవయ్యాయి ఇవి కాస్త తగ్గించిన ఇంపాక్ట్ బాగుంటుంది. మంచు మనోజ్ అందించిన స్టంట్స్ చాలా బాగున్నాయి కాని సన్నివేశాలలో బలం లేకుండా వచ్చిన ఈ పోరాట సన్నివేశాలు మరియు స్టంట్స్ చిత్రానికి సహాయ పడలేదు.. 24ఫ్రేమ్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి..
కాఫీ తీసుకొని కాఫీ లా ఉండకూడదు అని ఉప్పు వేస్తే రుచిపోతుంది, ఈ విషయం దర్శకుడు మరిచిపోయాడు ఈ చిత్రం విషయానికి వస్తే "వరుత పడాద వాలిబర్ సంఘం" అనే కాఫీ ని తీసుకొచ్చి, ఫైట్స్ మరియు అందాల ఆరబోత అనే ఉప్పుని జత చేసి "కరెంటు తీగ" అనేసారు కాని రుచి పోయింది. చిత్రంలో రెండు రకాల సన్నివేశాలు ఉన్నాయి ఒకటి తమిళంలో ఉన్నదీ ఉన్నట్టు గా తీయడం, రెండోది సొంత సన్నివేశాలను తియ్యడం తమిళంలో ఎలా ఉందో అలానే తీసిన అన్ని సన్నివేశాలు చాలా బాగా పేలాయి కాని స్వంతంగా రాసుకున్న సన్నివేశాలన్నీ విఫలం అయ్యాయి.. ముఖ్యంగా హీరో ఫైట్ చెయ్యడం కోసం మాత్రమే పెట్టుకున్న విలన్ పాత్ర ఎందుకు ఉందో ఆ పాత్రకే ఒక ఐడియా ఉండదు.. రకుల్ ప్రీత్ సింగ్ చేత నటన బయట పెట్టకుండా అందాలను బయటపెట్టించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.. సీపాన శ్రీధర్ చేత రాయించిన మాటలు కూడా ఆకట్టుకోలేదు. తమిళంలో సంఘం చుట్టూ చిత్రం తిరుగుతుంది తెలుగులోకి వచ్చే సరికి ఆ సంఘం గురించి బొత్తిగా మాట్లాడారు ఈ చిత్రానికి ఉన్న మేజర్ మైనస్ అదే, సంఘం చుట్టూ కథని తిప్పి ఉంటె ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేవాడు.. ఫైట్స్ చూడటానికి బాగున్నాయి కాని బాగా పొడవు అయ్యాయి ప్రతి ఫైట్ కూడా క్లైమాక్స్ ఫైట్ ని తలపిస్తుంది.. ఈ చిత్రంలో కావలసినవి అన్ని ఉన్నాయి కాని అన్ని సరిపడా స్థాయిలో లేదు .. తమిళంలో చూడకపోయి ఉంటె ఒకసారి ప్రయత్నించండి, తమిళ చిత్రం చూసిన వారు మరోసారి తమిళ చిత్రాన్ని చూడటమే మంచిది..
Manchu Manoj,Rakul Preet Singh,G.Naageswara Reddy,Manchu Vishnu,Achu.చివరగా : లో వోల్టేజ్ "కరెంటు తీగ"