ఒక క్రిమినల్ ప్రేమకథ : రివ్యూ
శీను (మనోజ్) ఒక వీడియోషాప్ లో పని చేస్తూ ఉంటాడు అలా ఒక ఫంక్షన్ లో బిందు(పల్లవి ప్రియాంక) ని చూసి ప్రేమలో పడిపోతాడు స్కూల్ లో చదివే బిందు మొదట శీను ని దూరంగా ఉంచినా కూడా మెల్లగా తను కూడా శీనుని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇదిలా నడుస్తుండగా బిందు తండ్రి కి ఆరోగ్య సమస్యలు రావడంతో బిందు మరియు వారి కుటుంబం విశాఖపట్నం లో ని బిందు మామయ్య(సత్యానంద్) ఇంటికి వెళ్ళిపోతారు. బిందు శీను ని కూడా విశాఖపట్నం వచ్చేయమని అంటుంది వెంటనే శీను విశాఖపట్నం చేరుకొని బిందు చదివే కాలేజీ లో నే కాంటీన్ లో పని చేసుకుంటూ ఉంటాడు . కాని శీను ని చుసిన బిందు అతనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తుంది. శీను మనస్తాపం చెంది ఆత్మ హత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు అప్పుడు బిందు వచ్చి తనని అంతగా ప్రేమిస్తే, తన కోసం ఏదయినా చెయ్యగలిగితే ఒకరిని హత్య చెయ్యాలి అని అడుగుతుంది.. అసలు బిందు శీను ని ఎందుకు గుర్తు పట్టనట్టు ప్రవర్తిస్తుంది? ఎవరిని హత్య చెయ్యమని అడుగుతుంది? అనే ప్రశ్నలకి జవాబులు మిగిలిన కథ..
మనోజ్ నందన్ నటనా పరంగా కాస్త అభివృద్ధి చెందాడు అనే చెప్పుకోవాలి కాని అతని పాత్రకు తగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రియాంక పల్లవి అటు నటనాపరంగా ఆకట్టుకోలేకపోయింది ఇటు అందంతో నూ ఆకట్టుకోలేకపోయింది ఈ నటి గురించి చెప్పుకోవడానికి ఇంతకన్నా ఎం లేదు .. ఇక మరో ముఖ్య నటుడు సత్యానంద్ , గొప్ప పేరున్న ఈ నటుడు ఇలాంటి పాత్రను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే ఈ పాత్ర అయన స్థాయికి సరిపోయేది కాదు ఈ చిత్రంలో అయన నటన కూడా అంత గొప్పగా లేదు అనే చెప్పుకోవాలి.. మనోజ్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు కూడా పరవాలేదనిపించాడు.. మిగిలిన అందరు నటులు ఏదో ఉన్నాం అనిపించి మాయం అయిపోయారు..
కథ , కథనం, మాటల, దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను పి సునీల్ కుమార్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు ఇప్పుడు ఒక్కొక్క విభాగం గురించి మాట్లాడితే...
కథ, దర్శకుడు ఎం చెప్పాలి అనుకున్నాడు అనేది కథ అంటే ఇందులో అతను చెప్పాలి అనుకున్నది "చైల్డ్ అబ్యూస్" అంటే పిల్లల మీద జరిగే లైంగిక దాడుల గురించిన కథ ఇది.. కథనం, ఈ చిత్ర కథనం గురించి మాట్లాడుకోవాలి అంటే అనుకున్న కథకు సరిపోయే సన్నివేశాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ... మొదటి అర్ధ భాగం మొత్తం ఒక వైపు నడిపి రెండవ అర్ధ భాగంలో అసలు పాయింట్ మీదకు వచ్చారు సునీల్ కుమార్ రెడ్డి.. మిగిలిన అంశాలు విశ్లేషణలో చర్చించుకుందాం...
మాటలు, మాములుగా రాసిన మాటలు అంతంతమాత్రంగానే ఉన్నా గొప్పగా రాయాలి అని ప్రయత్నించినవి మాత్రం సెన్సార్‌లో పోయాయి కాబట్టి మాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.. దీని గురించి కూడా విశ్లేషణలో కొన్ని వాక్యాలు మాట్లాడుకుందాం ...
దర్శకత్వం, సందేశాత్మక చిత్రం చెయ్యాలనే ఆలోచన రావడం మంచిదే కాని సందేశాన్ని అర్ధం అయ్యేలా చెప్పలేనప్పుడు సందేశం ఎదయితేనేంటి.. సమస్య మీద పోరాటం మా చిత్రం అంటే దానికి పరిష్కరాన్ని కూడా చూపించక పోవడం సునీల్ కుమార్ రెడ్డి కి ఆనవాయితీగా మారిపోయింద.. ఈ చిత్రంలో కూడా సమస్య గురించి చెప్పారు కాని పరిష్కారం గురించిన చర్చ ఎక్కడా జరగలేదు...
సినిమాటోగ్రఫీ గురించి గొప్పగా చెప్పుకోడానికి ఏమి లేదు చిత్రానికి కావలసిన మూడ్ ని ఏ ఒక్క సన్నివేశంలో కూడా సృష్టించలేకపోయారు... అటు క్రైమ్ చిత్రం అన్న భావన కలగదు ఇటు రొమాంటిక్ చిత్రం అన్న భావన కలగనివ్వలేదు...
సంగీతం అందించిన ప్రవీణ్ ఇమ్మడి పాటలు ఆకట్టుకోలేదు అదే సమయంలో నేపధ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు సరిగ్గా సరిపోయింది. ఎడిటింగ్ అందించిన అర్చన ఆనంద్ ఇంకా చాలా సన్నివేశాలను కత్తిరించి ఉండవచ్చు పొడవు అయ్యాయి అని కాదు చిరాకు పుట్టించాయి .... ఈ చిత్రంలో బాగా హింసించిన మరొక విభాగం కాస్ట్యూమ్స్ నటులకు అసలు నప్పలేదు. నిర్మాణ విలువలు అంతంతమాత్రమే...
సినిమా ఒక బలమయిన మీడియా , అలంటి సినిమా ని ఉపయోగించి సందేశం ఇవ్వాలనుకోవడం మంచి ఆలోచనే, కాని అది ఎటువంటి సందేశం అనేదాని మీద మిగిలినవి ఆధారపడుతుంది.. ఇక ఒక క్రిమినల్ ప్రేమ కథ అనే చిత్ర విషయానికి వస్తే ఈ చిత్రం పిల్లల లేదా మహిళల మీద జరుగుతున్న లైంగిక దాడుల గురించి తీసారు కాని చిత్రం ఆసాంతం లైంగిక దాడులు వాటిలో విభాగాలు అన్న అంశాన్ని విశదీకరించి చెప్పారు కాని దాని పరిష్కారం ఏంటి అనే విషయాన్ని ఎక్కడా చూపించలేదు. పరిష్కారం లేని సమస్య ప్రేక్షకులకు చూపెడితే ఎం అర్ధం చేసుకోమన్నట్టు..
ఈ చిత్రం ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అని చెప్పినట్టు ఎక్కడా అనిపించలేదు ఇలా దాడి చేయ్యచు వాళ్ళని ఇలా చంపవచ్చు అని చూపించినట్టు ఉంది ఇది ఏ రకమయిన సందేశం అనేది దర్శకుడికే తెలియాలి. చివరి సన్నివేశం తప్పితే మిగిలిన అన్ని సన్నివేశాలు అలానే ఉన్నాయి ఇక మాటల విషయానికి వస్తే.. "మీ మగాళ్ళు ఎప్పుడో యుద్దానికి వెళ్ళినప్పుడే రక్తం చూస్తారు మేము నెల నేలా రక్తం చూస్తాము మాకు చెప్పకండి నేతురు గురించి" , " తాగుబోతు నా కొడుకులకు ఎందుకు నాన్నా పిల్లలు.. తాగేసి పెళ్ళాం తో పొర్లి పిల్లల్ని కనడం ఎందుకు" లాంటి అతి ఘోరమయిన సంభాషణలు ఉన్నాయి.
ఈ చిత్రం లో .. అసలు లైంగిక దాడులు ఎలా జరుగుతున్నాయి అని చూపించడంలో దర్శకుడు చూపించిన సన్నివేశాలు .. ప్రేక్షకుల మీద జరిగిన లైంగిక దాడిలా సాగింది.. మహిళలు అమ్మాయిలను ఉద్దరించాలని తీసిన ఈ చిత్రాన్ని ఏ మగాడు లేదా అబ్బాయి ఒక అమ్మాయితో కలిసి చూడలేడు .. అమ్మాయిలకి అండగా నిలబడే చిత్రం అయితే కాదు చివర్లో దర్శకుడు అన్నట్టు నిశబ్దాన్ని చేదించండి అని చెప్పే చిత్రం అసలే కాదు.. ఇదే అంశం మీద ఈ ఏడాది హింది లో "హైవే" అనే చిత్రం వచ్చింది అందులో చాలా సున్నితంగా చూపించారు. ఈ చిత్ర విషయానికి వచ్చేసరికి ఆ సున్నితత్వం ఎక్కడా కనపడలేదు పైగా ఇదొక ప్రతీకారం లా అనిపించింది కాని పరిష్కారంలా అసలు అనిపించలేదు. అసలు లైంగిక దాడి ఎలా జరిగింది అని చూపించాల్సిన అవసరం ఏముందో ఎప్పటికీ అర్ధం కాని విషయం.. ఈ చిత్రం గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం వ్యర్థం ..ఈ సందేశాత్మక చిత్రంలో సందేశం తప్ప అన్ని ఉన్నాయి.. వెళ్ళమని సలహా ఇచ్చారు అంటే వారు మీకు శత్రువులని గమనించగలరు..
Manoj Nandam,Anil Kalyani,Suneel Kumar Reddy,Yekkali Ravindra,Praveen Immadi.ఒక క్రిమినల్ ప్రేమ కథ - ఒక ప్రేక్షకుడి విషాద గాథ..