తెలుగులో ఓటీటీ కలిసొచ్చిందా..?

NAGARJUNA NAKKA
తెలుగులో ఓటీటీ హిట్టయిందా? ఫ్లాప్‌ అయిందా? అంటే సమాధానం దొరకదు. కొత్త సినిమా రిలీజ్‌ తర్వాత ఎంత మంది సబ్‌స్క్రైబ్‌ అయిందీ.. ఎంతమంది చూసిందీ ఓటీటీ నిర్వాహకులు చెబితేగానీ.. తెలియదు. వాళ్లు చెప్పరు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎక్కువమంది చూస్తే.. ఓటీటీలో ఆ సినిమా హిట్‌ కింద లెక్క. ఇలాంటి సినిమా తెలుగులో వచ్చిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

కరోనా కారణంగా తెలుగులో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. కొన్నింటి అడ్రస్‌లు కూడా కనిపించలేదు. కీర్తి సురేష్‌ ఇమేజ్‌తో రిలీజైన పెంగ్విన్‌ సత్తా చాటలేకపోయింది. టీనేజ్‌ లవ్‌ స్టోరీస్‌తో వచ్చిన 'భానుమతి రామకృష్ణ'.. 'కృష్ణ అండ్ హిస్‌ లీల' పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్నా... చూసిన ప్రేక్షకులు తక్కువే. అప్పటివరకు చిన్నా చితకా చిత్రాలు ఓటీటీలోకి రాగా..  క్రేజ్‌తో రిలీజ్ అయిన మూవీ వి కూడా నిరాశనే మిగిల్చింది.

వి మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేసి నిర్మాత లాభపడినా.. ప్రేక్షకులతో ఓకె అనిపించుకోలేకపోయింది. వి తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఓటీటీ ఫాట్‌ ఫామ్‌లోకి అక్టోబర్‌2న రెండు క్రేజీ మూవీస్‌.. నిశ్శబ్దం.. ఒరేయ్‌ బుజ్జిగా విడుదలవుతున్నాయి. డిజిటల్‌కు  అమ్మి నిర్మాతలు బాగానే లాభపడ్డారు. భాగమతి తర్వాత రెండేళ్లు కనిపించని అనుష్క నిశ్శబ్దంతో వస్తోంది. ఈ మూవీ అయినా.. సైలెంట్‌గా వచ్చి ఓటీటీలో హిట్‌ అవుతుందో లేదో చూడాలి.

గాంధీ జయంతినాడు.. ఓటీటీలో రెండు క్రేజీ మూవీస్‌ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌.. మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా.. గుండెజారి గల్లంతయిందే ఫేం కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓరేయ్‌ బుజ్జిగా రూపొందింది. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుంది. ఓటీటీలో రిలీజైన సినిమా సూపర్‌హిట్‌ అయిందని చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. ఆ లోటును ఏ సినిమా భర్తీ చేస్తుందో చూడాలి.

మొత్తానికి తెలుగు సినిమా ఓటీటీలో హిట్ కాలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్యకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. చూసింది తక్కువే.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: