పుష్ప2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ సినిమా ప్రిమియర్ షో కు సంధ్య థియేటర్ కు వెళ్లిన క్రమంలో ఇదంతా జరిగింది.కాగా ఈ ఘటన అనంతరం ఎన్నో పరిణామాలు జరిగాయి.నటుడు అల్లు అర్జున్ అరెస్టు.. ఆ తర్వాత బెయిల్ పై విడుదల, రాజకీయాలు,వివరణలు ఇలా ఎన్నో ఘటనలు ఒకటి తర్వాత ఒకటి చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్‌కి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు హైదరాబాద్ పోలీసులు దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.ఇదిలావుండగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆ విచారణలో భాగంగా పోలీసులు, అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలో హైకోర్టు కు బన్నీ తప్పుడు ఆధారాలు సమర్పిస్తే మధ్యంతర బెయిల్ రద్దవుతుందని కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ఛైర్మెన్ తిరుపతి తెలిపారు.నిజాలను నిగ్గు తేల్చేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారని,అవసరమైతే సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తారన్నారు.కాగా బన్నీ బెయిల్ రద్దు కు పోలీసులు ఎస్సి ని ఆశ్రయించే అవకాశముంది.ఇదిలావుండగా బెయిల్ వచ్చినప్పుడు కేసుకి సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయకూడదు. అది రూల్ అంటున్నారు పోలీసులు. కానీ అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి మొత్తం కేసు గురించే మాట్లాడాడని ఇది చట్టవిరుద్ధమంటున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. పైగా హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయం మర్చిపోకూడదంటున్నారు. అలాగే అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్దమని నిరూపిస్తూ పోలీసులు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా థియేటర్లోకి ఎంట్రీ ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన దృశ్యాలను విడుదల చేశారు. సంధ్య థియేటర్‌కి రావొద్దని సూచించినా వెళ్లారని లిఖితపూర్వక రుజువులతో సహా ఆధారాలను బయటపెట్టారు. వీటితో పాటు మరిన్ని ఆధారాలను సేకరించి సుప్రీంకోర్టుకు సమర్పించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది.