ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ వ్యవహారం చాలా దారుణంగా తయారైంది. పుష్ప2 రిలీజ్ సందర్భంగా వేసినటువంటి బెనిఫిట్ షోలకు వేలాది మంది అభిమానులు వచ్చారు. హైదరాబాదులోని సంధ్య థియేటర్ కు అభిమానుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలోనే అదే థియేటర్ కు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సినిమా చూడడానికి రావడంతో క్రౌడ్ మరింత ఎక్కువైంది. ఈ సందర్భంగానే జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయాల పాలై ఆస్పత్రిలో చేరారు. దీంతో తెలంగాణ గవర్నమెంట్ సంధ్య థియేటర్, అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్టు కూడా చేసింది.
ఇక అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్టు అయ్యారో అప్పటి నుంచి ఇండస్ట్రీ అంతా రగిలిపోయి ఆయన రిలీజ్ కాగానే వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి పరామర్శ చేసింది. కానీ చనిపోయిన రేవతి కుటుంబం ఇంటికి ఎవరూ రాలేదు. దీంతో కోపానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎవరైనా ఎవరైనా సరే చట్టముందు సమానులే అని తెలియజెప్పారు. చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఎవరు పరామర్శించలేదు, పేదల ప్రాణాలు అంటే లెక్క లేదా అంటూ విమర్శించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
దీంతో ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. దీనిపై దిగివచ్చినటువంటి అల్లు అర్జున్ ప్రాణలతో పోరాడుతున్న శ్రీ తేజ్ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, బన్నీ వాసు, అల్లుఅర్జున్ అంతా కలిసి దాదాపుగా రెండు కోట్లకు పైగా జమ చేసి ట్రస్టు ఏర్పాటు చేస్తామని ఆ మొత్తాన్ని అతని వైద్య ఖర్చులు లైఫ్ లో ఇతర అవసరాలకు ఉపయోగించే విధంగా చేస్తామని చెప్పారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇదంతా ముందే చేసి ఉంటే ఇలా జరగకపోవు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.