ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు: ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కున్న వెంకీ.?

Pandrala Sravanthi
వెంకటేష్ సినిమాలో ఒక రకమైన కామెడీ ఉంటుంది.. అవి యాక్షన్ సినిమాలు అయినా సరే ఆ సినిమాలో కచ్చితంగా కామెడీ పండిస్తారు. అలాంటి సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో సౌందర్య,వినీత హీరోయిన్స్ గా నటించారు. అలాగే బ్రహ్మానందం,కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ లు కీలక పాత్రల్లో చేశారు.. అయితే ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ నటించి చూసే వారికి ఎంతో కామెడీని తెప్పించారు.. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో  వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది.అయితే కష్టాల్లో ఉన్న తనకి సహాయం చేశాడు అనే ఉద్దేశంతో ఇవివి సత్యనారాయణ  రామానాయుడు రుణం తీర్చుకోవడానికి రామానాయుడు కొడుకు అయినటువంటి వెంకటేష్ తో అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలు తీసారట.

 ఇక ఈ సినిమా కోసం ముందు కొంతమంది హీరోలను అనుకున్నప్పటికీ టైటిల్ బాగాలేదని సినిమాని ఒప్పుకోలేదట. కొంతమంది హీరోలేమో సినిమా టైటిల్ మారిస్తే ఖచ్చితంగా నటిస్తామని చెప్పారట. కానీ ఇవివి సత్యనారాయణ మాత్రం టైటిల్ చేంజ్ చేయడం ఇష్టం లేక హీరోలను కూడా వద్దనుకున్నారట.ఇక చివరిగా వెంకటేష్ కి చెప్పగా ఆయన ఓకే చేశారు. ఈ సినిమా తమిళంలో విడుదలైన తాయ్ కులమే తాయ్ కులమే అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అలాగే ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈ సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక కథ విషయంలోకి వెళ్తే.. సౌందర్యను పెళ్లాడిన వెంకటేష్ కి సౌందర్యలో లోపం ఉండడం వల్ల పిల్లలు పుట్టారు.

అయితే ఈ విషయం తెలియక వెంకటేష్ ని ప్రతిసారి తన తండ్రి కోట శ్రీనివాసరావు నిందిస్తూ ఉంటారు. కానీ వెంకీ మాత్రం భార్యలో ఉన్న లోపాన్ని బయటపెట్టారు. ఇక బిజినెస్ పని మీద నేపాల్ వెళ్ళిన సమయంలో వినీత పరిచయమై  అనుకోని పరిస్థితుల్లో ఆమె మెడలో తాళి కడతారు. అలా ఆ ఇంటికి వచ్చాక వినిత ప్రెగ్నెంట్ అయ్యి బాబు పుడతాడు. ఇక అసలు విషయం తెలుసుకున్న కోట శ్రీనివాసరావు కోడల్ని పనిమనిషిగా ఇంటికి తీసుకొస్తాడు. కోడలికి సహాయం చేస్తూ ఉంటే సౌందర్య పనిమనిషితో మామ ఎఫైర్ పెట్టుకున్నాడని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అలా వీరి మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ఇలా ఎన్నో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 1996 మే 23న విడుదలైన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కుటుంబ కథా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: