నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లోనే తిరుగులేని ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతోంది. అఖండ సినిమాకు ముందు బాలయ్య కెరీర్ ఒకలా ఉంటే .. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ మరోలా దూసుకుపోతోంది. వరుసగా అఖండ - వీరసింహారెడ్డి - భగవంత్ కేసరి లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు బాలయ్యకు వచ్చాయి. ఇటు బుల్లితెరపై అన్స్టాపబుల్ టాక్ షో తో షేక్ చేసి పడేస్తున్నాడు. అటు రాజకీయాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ కూడా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే సంక్రాంతికి బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కెరీర్ 109వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అఖండ 2 సినిమా షూటింగులో జాయిన్ అవుతాడు. ఇదిలా ఉంటే బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన కెరీర్ ను ఎప్పటికప్పుడు కనిపెడుతూ బాలయ్యను కంటికి రెప్పలా చూసుకుంటారు ఆయన భార్య నందమూరి వసుంధర దేవి. వసుంధర దేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ. వీళ్ళ కుటుంబానికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ బాలకృష్ణకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారు.
ఈ క్రమంలోనే బాలయ్య ఇటు షూటింగులతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాలలో బిజీ బిజీ గా ఉన్నారు. బాలయ్య వసుంధరను చూసుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్లారు. అమ్మాయి బాగా నచ్చింది.. ఇక కట్న కానుకలకు వచ్చేసరికి ఆ రోజుల్లోనే బాలయ్యకు కట్నం విషయంలో పట్టింపు లేకపోయినా వసుంధర తల్లిదండ్రులు రు. 10 లక్షలు నగదు కట్నంగా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆ కట్నం నగదును తీసుకొని ప్రస్తుతం బాలయ్య జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో ఉంటున్న ఇంటిని కొనుగోలు చేశారు.