ఇండస్ట్రీలో కాళ్లకు చెప్పులు అరిగేలా తిరగలి.. బుచ్చిబాబుకి జీవితాంతం రుణపడి ఉంటా: అర్జున్ అంబటి
మెగా హీరో రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో అర్జున్ అంబటికి అవకాశం ఇస్తున్నట్లు స్వయంగా డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ వేదికపై తనకు తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆర్సీ 16 షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుంది.
అయితే ఇటీవల అర్జున్ అంబటి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అర్జున్ అంబటి మాట్లాడుతూ.. 'బుచ్చిబాబు బిగ్ బాస్ షోలో నాకు ఆఫర్ ఇచ్చారు. ఆర్సీ 16 సినిమాలో సూపర్ క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పారు. ప్రస్తుతం నేను బుచ్చిబాబు కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని, నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే. ఆఫీసుల చుట్టూ కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలాగా తిరగాల్సి ఉంటుంది. అయినా ఛాన్స్ వస్తుంది అనే గ్యారెంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో నాకు ఆఫర్ ఇచ్చారు. బుచ్చిబాబు అన్నకి జీవితాంతం నేను రుణపడి ఉంటా' అని అర్జున్ అంబటి తెలిపారు.