ఆ ఇండియా సినిమాపై గల్ఫ్‌లో నిషేధం.. ఎందుకంటే?

Chakravarthi Kalyan
కాశ్మీర్లో ఒకప్పటి పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆదిత్య సుహాస్ జంబలే ఆర్టికల్ 370 అనే సినిమాను తెరకెక్కించారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు.. ఆ తర్వాత కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. అక్కడి శాంతి భద్రతలు ప్రస్తావిస్తూ ఈ సినిమాను రూపొందించారు. యామి గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవలి, వైభవ్, కిరణ్ కర్మాకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.

వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీబీ 6 స్టూడియోస్ నిర్మించాయి. ఇండియాలో భారీగా వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రానికి గల్ఫ్ దేశాలు బ్రేకులు వేశాయి. పాకిస్థాన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇందులో ఉండడంతో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గల్ఫ్ దేశాల్లో ఒక భారతీయ సినిమాను విడుదల చేయాలంటే అక్కడి సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గత నెలలో హృతిక్ రోషన్ హీరోగా రూపొందించిన ఫైటర్ సినిమాపై సైతం గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయి.  అయితే  ఈచిత్రం విడుదల కాకముందే ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని విషయాలు గురించి సరైన సమాచారం తెలియాలంటే ఆర్టికల్ 370 లాంటి సినిమాను చూడాలని ప్రకటించారు.

ఓ ప్రముఖ వార్తాసంస్థ కథనం ప్రకారం గల్ప్ దేశాలన్నింటిలో ఈ చిత్రం ప్రదర్శించబడటం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ లో ఈ సినిమాపై నిషేధం విధించారు. కాకపోతే నిషేధానికి నిర్ధిష్ట కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. మరోవైపు ఈ సినిమా పాజిటివ్ టాక్ తో భారీగానే కలెక్షన్లను రాబడుతోంది. కొన్ని ఎన్ కౌంటర్ సన్నివేశాల్లో యామీ గౌతమ్ సూపర్ గా నటించింది. ఈ సినిమాలో ఆర్టికల్ 370ఎత్తివేత, దాని వెనుక జరిగిన కసరత్తు గురించి దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకులను మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: