Dheera Movie Review: ధీర రివ్యూ.. మాస్ యాక్షన్ మూవీ

Anilkumar
ఇంట్రడక్షన్: వలయం, గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లక్ష్ చదలవాడ ఇప్పుడు హీరోగా ధీర అనే సినిమా చేశారు.. నేహా పఠాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం సినిమా రివ్యూలో తెలుసుకుందాం.
ధీర రివ్యూ:
డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే రణధీర్(లక్ష్) ఒక పాతిక లక్షల రూపాయలు వస్తాయని తెలియడంతో విశాఖపట్నం నుంచి కోమాలో ఉన్న పేషెంట్ ని హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతాడు. అంబులెన్స్ డ్రైవర్ గా వెళ్లిన ధీర్ కి ఆ అంబులెన్స్ లో డాక్టర్ గా వచ్చేది తన మాజీ ప్రేయసి అమృత (నేహా పఠాన్) అని తెలుస్తుంది. లోపల ఉన్న పేషెంట్ ని చంపడానికి కొన్ని గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉండడంతో చాకచక్యంగా ఆ పేషెంట్ ని హైదరాబాద్ హాస్పిటల్ కి తరలిస్తాడు రణధీర్. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక తల్లి బిడ్డ తాను డ్రైవ్ చేస్తున్న వాహనంలో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. ఆ తల్లి బిడ్డను కాపాడమని చెప్పి రణధీర్ ను చావు నుంచి కాపాడుతుంది. అయితే అసలు రణధీర్ తీసుకెళ్లిన పేషెంట్ ఎవరు? రణధీర్ ను తన బిడ్డని కాపాడమని ప్రాధేయపడిన మహిళ ఎవరు? చిన్న పాప కోసం ఎందుకు కొన్ని గ్యాంగులు వెంట పడుతున్నాయి? తన కోసం ప్రాణాలు అర్పించిన తల్లి కుమార్తెను రణధీర్ ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
ధీర సినిమా ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్ ని కాస్త వింతగా చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే ఒక వ్యక్తిగా ధీర క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఎందుకు అలా చేస్తున్నాడు? అనే విషయాన్ని మాత్రం చివరి వరకు కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. అయితే డబ్బు కోసం ఏమైనా చేయగలిగే ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడడం కోసం మరొక మహిళ ప్రాణాలు అర్పించి తన బిడ్డను కాపాడమంటే ఆ బిడ్డ కోసం 2500 కోట్ల రూపాయలను సైతం కాలదన్ని ఆ బిడ్డను కాపాడేందుకు వెళ్లిన విషయం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్ ని కాస్త భిన్నంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు సినిమా గడుస్తున్న కొద్ది కథలో ఒక్కొక్క లేయర్ ను రివీల్ చేస్తూ వచ్చాడు. అయితే కథ కాస్త ఊహకి దూరంగా ఉన్నా తర్వాత ఏం జరగబోతుంది? అనే విషయం మీద క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. అది సినిమాకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. విక్రాంత్ శ్రీనివాస్ రూపొందించిన ధీర ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌. రొటీన్ సన్నివేశాలు అనిపించినప్పటికీ సినిమాలో తరువాత ఏమిటి ? అనే ఆసక్తి కలుగుతుంది. రొమాంటిక్ సహా కొన్నికామెడీ సీన్స్ తో అడపాదడపా కథనాన్ని స్లో చేసినట్లు అనిపించింది. ఇక  సెకండాఫ్, అయితే యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండి ఉంది. సినిమా మాంచి ఊపుమీద ఉన్నప్పుడు కూడా దర్శకుడు గ్యాప్ లో హాస్యాన్ని నింపే ప్రయత్నాన్ని చేసినట్లు ఈజీగా అర్థమవుతుంది. కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అయినట్లు అనిపించలేదు.  కథనంలో సూక్ష్మంగా ఇమిడింపచేసిన రాజకీయ కోణాలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే డబ్బు కోసం ఏమైనా చేసే యువకుడి పాత్రలో లక్ష్ చదలవాడ తనదైన స్టైల్ లో నటించాడు. ఆయన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫైట్స్ లో ఇంటెన్స్ కనిపించింది.  నేహా పఠాన్, ఒక డాక్టర్ పాత్రను పోషించి ఆకట్టుకుంది. ఎమోషనల్ అమ్మాయిగా సరిగ్గా సూట్ అయింది.  సోనియా బన్సాల్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఉన్నంతలో తన మార్క్ చాటుకునే ప్రయత్నం చేసింది.  సీఎం పాత్రలో సుమన్, ఆయన పీఏ పాత్రలో హిమజ ఆకట్టుకున్నారు. సామ్రాట్ రెడ్డికి చాలా కాలం తర్వాత ఫుల్ లెన్త్ రోల్ దొరికింది.  టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సాయి కార్తీక్ సంగీతం, జానర్‌కు తగినట్లుగా ఉంది. కొన్ని పాటలు క్యాచీగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంటెన్సిటీని పెంచింది. వినయ్ రామస్వామి ఎడిటింగ్ డీసెంట్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరి మాట: ధీర.. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్.. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది.
రేటింగ్: 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: