ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి.మాలీవుడ్‌లో సూపర్‌హిట్ సాధించిన సినిమాలెన్నో ఓటీటీలో బంపర్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి.తాజాగా అలా అలరిస్తున్న మరో మలయాళ చిత్రమే 'నెరు'. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.సీరియస్ పాయింట్‌కు కోర్డు డ్రామా జతకలిపి ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ సాధించాడు. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్న జీతూ 'నెరు’ మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే సారా మహ్మద్ (అనశ్వర రాజన్) ఒక అంధురాలు. గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేస్తాడు. మట్టితో శిల్పాలు చేయడంలో సిద్ధహస్తురాలైన సారా.. తనపై అత్యాచారం చేసిన వ్యక్తి శిల్పాన్ని చేస్తుంది. దాని ఆధారంగా పోలీసులు మైఖేల్ జోసెఫ్ (శంకర్)ను అరెస్టు చేస్తారు. మైఖేల్ ధనవంతుల బిడ్డ.అతణ్ని కాపాడుకోవడానికి మైఖేల్ తండ్రి పేరుమోసిన క్రిమినల్ లాయర్ రాజశేఖర్ (సిద్దిఖ్)ను రంగంలోకి దించుతాడు. అంధురాలు తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా శిల్పంగా చేస్తుందని వాదించి, నిందితుడికి బెయిల్ వచ్చేలా చేస్తాడు రాజశేఖర్. మరోవైపు సారా తరఫున కోర్టులో వాదించడానికి ఏ లాయరూ కూడా ముందుకురాడు. పోలీసుల సూచన మేరకు సారా కేసు తీసుకోవాల్సిందిగా ఆమె తండ్రి… లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ను ఆశ్రయిస్తాడు. చాలా రోజులుగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న విజయ్ సారా కథ విన్నాక ఆమె తరఫున వాదించడానికి ఒప్పుకుంటారు.ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు?..విజయ్ మోహన్ కేసు ఒప్పుకొన్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?..విజయ్‌కి, రాజశేఖర్ కూతురు పూర్ణిమ (ప్రియమణి)కి ఉన్న సంబంధం ఏంటి?.. అనేది ఈ సినిమా మిగిలిన కథ.మొదటి పది నిమిషాల్లో కథ తెలిసిపోయినా సరే నేరాన్ని నిరూపించడం ఎలా నడిపించారన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారు.