KGF' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న ప్రభాస్ కి 'సలార్' భారీ కం బ్యాక్ ఇచ్చింది. అంతేకాకుండా మొదటి రోజు రూ.178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్‌ను వాడుకున్న విధానం ప్రేక్షకులకు నచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 'సలార్' సినిమా రూ.600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
ఇక సంక్రాంతికి ఎన్నో సినిమాలు థియేటర్లలో సందడి చేయడంతో ‘సలార్’ జోరు కాస్త తగ్గింది. ఫైనల్‌గా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 20 అనగా శనివారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది 'సలార్'. అర్ధరాత్రి నుంచే సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన 28 రోజులకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ 'సలార్' ఓటీటీ హిందీ వెర్షన్ ని మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.
హిందీలో ఒప్పందం ప్రకారం థియేటర్లో రిలీజ్ అయిన 8 వారాలకు ఓటీటీ వర్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక విధంగా హిందీ ఆడియన్స్ కి ఇది బాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక మిగతా భాషలో ఆడియన్స్ థియేటర్లో సినిమాని ఎవరైనా మిస్ అయి ఉంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. చూసేయండి. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా ప్రధాన పాత్ర చేశారు. ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.