త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'గుంటూరు కారం' మరో వారు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహేష్ బాబుని త్రివిక్రమ్ ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో చూపిస్తుండడం ఒకెత్తు అయితే సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్లతో మహేష్ మొదటిసారి జోడి కడుతుండడంతో
ఆన్ స్క్రీన్ పై ఈ హీరోయిన్స్ తో మహేష్ చేసే రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ సినిమా పై ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పటివరకు సినిమా నుండి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో మహేష్, శ్రీలీల మాత్రమే కనిపించారు తప్పితే ఎక్కడా మీనాక్షి చౌదరి కనిపించలేదు. కనీసం ఆమెకు సంబంధించి ఒక పోస్టర్ కూడా బయటికి రాకపోవడంతో అసలు సినిమాలో మీనాక్షి చౌదరి ఉందా? అనే అనుమానం కూడా వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో తాజాగా సినిమా నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మహేష్ బాబుతో మీనాక్షి చౌదరి కనిపించడం ఆధ్యంతం ఆకట్టుకుంది.
ఇందులో 'రాజీ' అనే పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనుంది. పోస్టర్ ని గమనిస్తే.. ఇందులో మీనాక్షి చౌదరి లంగా ఓణీలో ముస్తాబై మహేష్ భుజాలపై చేతులు వేస్తూ కనిపించింది. పోస్టర్లో మహేష్, మీనాక్షి చౌదరి ఇలా క్లోజ్ గా కనిపించడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీళ్ళ మధ్య క్లోజ్ నెస్ ని బట్టి చూస్తే సినిమాలో మీనాక్షి మహేష్ కి మరదలిగా నటిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దీనికంటే ముందు రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ లో మహేష్ బాబు శ్రీ లీల వెంట పడడం గమనించవచ్చు. బహుశా మహేష్ తన సొంత మరదలు అయినా మీనాక్షిని పక్కన పెట్టి శ్రీలీలని ప్రేమిస్తాడేమో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.