'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచి దర్శక ధీరుడిగా వెలుగొందుతున్న ఎస్. ఎస్ రాజమౌళి గత ఏడాది 'RRR' తో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఓ సీరియల్ డైరెక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన రాజమౌళి తన ఫిలిం మేకింగ్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళికి ఏ సినిమా నష్టాలను తీసుకురాలేదు. అన్ని సినిమాలు మంచి సక్సెస్ అవ్వడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. అలా ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడిగా
కొనసాగుతున్న రాజమౌళి కెరియర్ లో ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే విషయం మీకు తెలుసా? అవును.. రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా కొంతవరకు షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఆ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎందుకు ఆగిపోయింది? అనే విషయానికొస్తే.. 'స్టూడెంట్ నెంబర్ వన్' తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు సూర్య ప్రకాష్ తో రాజమౌళి ఓ సినిమాకి కమిట్ అయ్యారట. షూటింగ్ పనులు జరుగుతుండగా మధ్యలోనే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల షూటింగ్ ఆపేశారని తెలుస్తుంది. అంతేకాకుండా అప్పటికే సూర్య ప్రకాష్ నటించిన సినిమాలు కూడా
ప్లాప్ కావడంతో ఈ సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదని, దాంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం. ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతోనే రిపీటెడ్ గా సినిమాలు చేసిన జక్కన్న మొదటిసారి మహేష్ బాబుతో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు.