'అందుకే ఇండ్రస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.. నవదీప్ తో గొడవకి కారణం అదే' : అంకిత

Anilkumar
టాలీవుడ్ లో ఒకప్పుడు చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంకిత. 'లాహిరి లాహిరి లాహిరిలో' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అంకిత.. 'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భూమిక మెయిన్ హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్గా అంకిత కనిపించింది. ఈ సినిమాలో అంకిత తన అందంతో పాటు అభినయంతోను ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ, రవితేజ, గోపీచంద్ లాంటి అగ్ర హీరోల సరసన నటించింది. కానీ హీరోయిన్ గా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైంది. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తన సినీ కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు తాను సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో వివరించింది." బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా తర్వాత నాకు పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయని అనుకున్నాను. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉండేదాన్నేమో. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే కెరియర్ సాగుతుంది" అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఆ తర్వాత అప్పట్లో హీరో నవదీప్ తో జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇస్తూ.. " నవదీప్ తో నాకు ఎలాంటి గొడవలు లేవు. నవదీప్ తో కలిసి నటించిన సినిమా సమయంలో మరో తమిళ సినిమాలో నటించడం, రెండు సినిమాల చిత్రీకరణ ఒకేసారి సాగడంతో కొంత ఒత్తిడికి లోనయ్యాను. ఆ క్రమంలోనే అసహనానికి గురయ్యాను. అంతేగాని నవదీప్ తో నాకు ఎలాంటి గొడవ జరగలేదు" అంటూ తెలిపింది. ఇక ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని, వాళ్ళు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధకరమని అన్నారు అంకిత. అంతేకాకుండా గత ఏడాది అల్లు అర్జున్ ని కలిశానని, ఎన్టీఆర్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటున్నానని, అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం అని చెప్పింది. ఇక చివరగా మంచి అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో తాను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం అంకిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: