మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ, నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి సితార నిర్మాత నాగ వంశీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాగవంశి నిర్మాతగా రూపొందిన 'సార్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ వంశీ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ క్రమంలోనే మహేష్, త్రివిక్రమ్ సినిమా గురించి ప్రస్తావన రాగా.. నాగ వంశి మాట్లాడుతూ..' మహేష్ బాబు సినిమా ద్వారా రాజమౌళి గారి రికార్డ్స్ కి దగ్గరగా వస్తామని చెప్పారు. ఇప్పటికే అలవైకుంఠపురం సినిమాతో ఇంచుమించుగా ఆ రేంజ్ కి వెళ్ళామని.. 'SSMB 28' కి సంబంధించి కొన్ని ఫుటేజ్ లను తాను చూసానని కచ్చితంగా ఈ సినిమా అద్భుతాలు చేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఫ్యాన్స్ కి ఈ సినిమా అసలు డిసప్పాయింట్ చేయదని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ఉండబోతుందని అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ గురించి కూడా చెప్పారు.
మహేష్ బాబు మూవీ తర్వాత ఎన్టీఆర్ తోనే త్రివిక్రమ్ మూవీ ఉంటుందని.. ఈసారి ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వెల్లడించారు. ఇక మహేష్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ గురించి నాగవంశి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయనే చెప్పాలి. ఇక సార్ సినిమా విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అవుట్ ఫుట్ విషయంలో తాను సంతోషంగా ఉన్నానని అన్నాడు నాగ వంశీ. మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రులకు కచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది..!!