అసలు విరాటపర్వం సినిమా వెనుక ఏం జరుగుతోంది..!!

Divya
కరోనా కారణంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రిలీజ్ కి నోచు కోకుండా వాయిదాలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఒక సినిమా తరువాత మరొక పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే ఒక మూవీ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేదు. కారణం ఏమిటన్న విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. భారీ చిత్రాలు వరుసగా విడుదల అవుతున్న రానా నటించిన విరాటపర్వం సినిమా గురించి మాత్రం ఎక్కడా వూసే లేకుండా పోయింది. రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. ఈ సినిమా 1990వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసుకుని దర్శకుడు తెలుగు ప్రేక్షకుల అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం గమనార్హం..
ఇకపోతే ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపిస్తున్నాడు.. ముఖ్యంగా పరిస్థితుల కారణంగా నక్సలైట్ గా మారిన యువకుడిగా కామ్రేడ్ రవన్న పాత్రలో రానా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. అతని కవితలకు ఆకర్షితురాలైనా యువతిగా అతన్ని వెతుక్కుంటూ అడవి బాట పట్టిన అమ్మాయిగా సాయిపల్లవి ఇందులో మనకు కనిపించబోతోంది. ఇద్దరి జీవితాల్లో ఎదురైన అనూహ్య సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా మారనున్న ట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ , టీజర్ ఇప్పటికే విడుదలై సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.
గతేడాది ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్రకటించారు.  కానీ కరోనా కారణంగా పరిస్థితులు మారిపోవడంతో ప్లాన్ కూడా మారిపోయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రకటన కూడా బయటకు రాలేదు. ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. కాకపోతే ఇందులో బాలీవుడ్ నటులు నందితా దాస్ తో పాటు ప్రియమణి, నవీన్ చంద్ర, సాయిచంద్  , నివేదా పేతురాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లెక్స్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం బాగా జరుగుతోంది. థియేటర్లు లభించని పరిస్థితుల కారణంగా  ఓ టీ టీలో రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: