మంచి పాటకు సంకేత ధామం ఎక్కడ ఉంది అన్నది నేను వెతుకుతూ పోతూ ఉన్నాను. మంచి పాట అంటే జనం ఊగిపోయే పాటో తూగిపోయే పాటో అని కాదు ఆలోచనకు అందే పాట..గుండె సవ్వడులకు ప్రతినిధి అయిన పాట..అలాంటి పాటను ప్రేమిస్తాను.. ప్రేమిస్తూ పోతాండాను కూడా! ఆ విధంగా ఆ తోవలో ఆ కోవలో. ఆ రోజు విజయనగరం దారుల్లో చీపురుపల్లి వీధుల్లో
ఆ కుర్రాడిని కలిశాను. పాటలు నేర్పాను.. పాటలు పాడించి కొన్ని పాటల అర్థ వివరణలు కూడా విశ్లేషించి చెప్పాను.. ఇది కదా కావాలి.. అండ్ ద టైటిల్ ఈజ్ పల్లె పదం ప్రాణ స్వరం.. ఇదీ నాటి తీరు..ఇప్పుడు ఊ అంటావా పాపా అంటూ మీరంతా ఊగిపోయేలా చేస్తున్న ఆ కుర్రాడు నా శిష్యుడు అని చెప్పడంలో పొగరు గర్వం అహం అన్నీ ఉన్నాయి ఉండాలి కూడా!
పుష్ప సినిమా ఎలా ఉన్నా ఆ పాట అదిరిపోయింది..ట్రెండ్ ఇన్ లో ఉంది.. ఆ పాట విన్నాక మగాళ్లంతా మండిపడ్డారు..కాస్త తెచ్చి పెట్టుకున్న కోపంతోనో ఆవేశంతోనో ఊగిపోయారు.. మరి! మేల్ వెర్షన్ ఉంటే ఎలా ఉండాలి ఎలా ఉంటుంది అనేందుకు సంకేత రూపం మా ఊరి కుర్రాడు నా శిష్యుడు రమణ ఆలపించిన పాట.. ప్రశాంత్ అనే యువ రచయిత రాసిన పాట... ఈ ఉదయం మళ్లీ ఆ గొంంతుక వింటూ ఆ కుర్రాడికి మీరంతా అభినందనలు తెలిపి, మరిన్ని మంచి పాటలు పాడే అవకాశం సినీ మాధ్యమంలోనూ దక్కాలని ఆశీస్సులు అందించండి.
ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకునే కుర్రాడు.. ఓ రోజు చీపురుపల్లి దారుల్లో పరిచయం అయ్యారు.. ఏమయ్యా నీకొక చైతన్య గీతిక నేర్పుతాను పాడుతావా అంటే ఎస్ సర్ పాడుతాను.. తప్పక పాడుతాను.. అది నా బాధ్యత అని అన్నాడు.. మెరకముడిదాం మండలం, కొర్లాం గ్రామానికి చెందిన ఈ కుర్రాడు రేలా రే రేలా ట్రూప్ నిర్వాహకుడు కోరాడ జానకీ రావు స్ఫూర్తితో ఎన్నో మంచి జానపద పాటలు నేర్చుకుని తరువాత సొంతంగా తనకంటూ ఓ ట్రూపును ఏర్పాటుచేసుకుని పల్లె పల్లెల్లో తన గానం వినిపిస్తూ, పల్లె పదుల సాహిత్యానికో పట్టుగొమ్మ అవుతున్నాడు. ఇది మా పాట ఇది మా మాట సర్ నేను నేర్చుకుంటాను ఇంకా అని ఆనందిస్తూ చెబుతాడు.. ఆడు నా శిష్యుడు రా అందుకే అంత గొప్పగా పాడుతాండు అని గర్వంగా చెప్పగలను. నిన్న మొన్నటి వేళ ఊ అంటావా పాపా ఊఊ అంటావా పాపా అంటూ పుష్ప సినిమా సాంగ్ కు పేరడీ వెర్షన్ పాడి అందరినీ అలరించాడు. ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
వినండిక మళ్లీ మళ్లీ శుభాకాంక్షలతో...
- రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి