సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాకు గీత గోవిందం సినిమాతో మంచి విజయం అందుకున్న పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సముద్రఖని కనిపించబోతున్నాడు, శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతికి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం తో సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతి కి విడుదల వాయిదా వేస్తూ ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ వాయిదా పడినప్పటికీ షూటింగ్ ను మాత్రం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసిన చిత్ర బృందం, సర్కారు వారి పాట సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ను తాజాగా ప్రారంభించింది. ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుంది. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా సంక్రాంతి కానుకగా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి.