దసరా పరిస్థితి ఏమిటి ?
కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గత ఏడాది 8 నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి. గత ఏడాది చివరి నుండి తిరిగి ధియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలు విడుదల ప్రారంభం అయి ఈసంవత్సరం మార్చి వచ్చేసరికి ‘ఉప్పెన’ జాతిరత్నాలు’ ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాలు విజయంతో ధియేటర్లు కళకళలాడాయి.
దీనితో సమ్మర్ కు తిరిగి పూర్వ వైభవం వస్తుంది అని భావిస్తున్న తరుణంలో తిరిగి సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరుకోవడంతో మళ్ళీ ధియేటర్లు మూత పడ్డాయి. సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిన తరువాత ధియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు ధియేటర్ల వైపు రావడం పూర్తి తగ్గించివేసారు.
టాప్ హీరోల సినిమాలు విడుదల అయితే మాస్ ప్రేక్షకులు తిరిగి ధియేటర్ల బాట పడతారు అని ఆశిస్తూ దసరా రేసుకు ‘ఆచార్య’ ‘అఖండ’ మూవీలు వస్తాయని ఆశించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేటు పెంపు ఆన్ లైన్ బుకింగ్ విషయంలో కొత్తకొత్త ఆలోచనలు చేస్తున్న పరిస్థితులలో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలకపోవచ్చు అని అంటున్నారు. దీనితో దసరా కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ‘మహాసముద్రం’ లాంటి మీడియం రేంజ్ సినిమాలు తప్ప మళ్ళీ భారీ సినిమాల సందడి ఉండదు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.
సరైన మాస్ మూవీ పడితే ధియేటర్లకు మాస్ ప్రేక్షకులు బాగా వస్తారు అన్న అంచనా గోపీచంద్ ‘సిటీమార్’ మూవీ మాసాల మూవీ అన్న సంకేతాలు వచ్చినప్పటికీ ఈమూవీకి కూడ కలక్షన్స్ అంతంతమాత్రంగానే వస్తున్న పరిస్థితులలో ఈ దసరాకు కూడ సరైన మాస్ సినిమా రాకుంటే ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు తెగ మదనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రిలీజ్ కు రెడీగా ఉన్న భారీ సినిమాల పై నిర్మాతల పెట్టుబడి సుమారు 15 వందల కోట్లకు దాటిపోవడంతో వీటి వడ్డీల భారంతో పాటు ఈమూవీల రిలీజ్ టెన్షన్ మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచులు ఇండస్ట్రీ వర్గాలను గందరగోళంలో పడేస్తున్నాయి..