కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. దాదాపుగా అన్ని రంగాలూ తీవ్రంగా నష్టపోయాయి. ఇందులో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఉంది. కరోనా వల్ల థియేటర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. థియేటర్స్ యాజమన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకుగాను సినీ పెద్దలు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు తదితరులు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే ఏపీలోని థియేటర్ల సమస్యలు, షోలకు అనుమతి ఇతర విషయాలపై చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ చిరంజీవిని ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించే ముందర ఏయే విషయాలను దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని సినీ పెద్దలతో చిరంజీవి భేటి అయ్యారు. ఇందులో ఆర్.నారాయణమూర్తి, ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సి.కల్యాణ్, స్రవంతి రవి కిశోర్, బాబీ, టాలీవుడ్ ప్రముఖులు నాగార్జున, నారాయణ దాస్ నారంగ్ తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ మీటింగ్‌పై కొందరు సినీ పెద్దలు అలక బూనారని తెలుస్తోంది. చిరంజీవి ప్రైవేట్ హౌస్‌లో మీటింగ్ పెట్టి అగ్రశ్రేణి నిర్మాతలను మాత్రమే ఆహ్వానించారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అందరూ హీరోలను ఆహ్వానించలేదని విమర్శిస్తున్నారు. కాగా, సినీ ఇండస్ట్రీని ఆదుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ పెద్ద దిక్కుగా ఉండే దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు మరణానంతరం పెద్ద దిక్కుగా చిరంజీవిగా వ్యవహరిస్తున్నారని పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సినీ కుటుంబాన్ని నడిపించడానికి కుటుంబ పెద్దగా చిరంజీవి బాధ్యతలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇకపోతే కొవిడ్ టైంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ద్వారా చిరు విరాళాలు సేకరించారు. అలానే ఇండస్ట్రీలోని సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి షూటింగ్స్‌కు పర్మిషన్స్ వచ్చేందుకు చిరు కృషి చేశారు. త్వరలో ఏపీ ప్రభుత్వంతోనూ భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటులందరూ కలిసి మెలిసి ఉండాలని పలువురు కోరుతున్నారు.