యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త చిత్రం రాధేశ్యామ్ ను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజునే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్ర బృందం. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ పలుమార్లు రీ షూట్ చేయడం తో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దానికి తోడు కరోనా మహమ్మారి కూడా ఈ సినిమా షూటింగు కు పలుసార్లు అంతరాయం కలిగించింది
వాస్తవానికి ప్రభాస్ కు ఈ సంక్రాంతి సీజన్ కు మంచి అనుబంధమే ఉంది. ఈ ముగ్గుల పండక్కి ఆయన గతంలో రెండు సార్లు సినిమాలు విడుదల చేయగా అవి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వర్షం చిత్రం 2004 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కాగా ఈ సినిమా ప్రభాస్ ను స్టార్ గా మార్చింది. ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ వర్షం సినిమా ను ప్రభాస్ అభిమానులు ఏమాత్రం మరచిపోలేరు.
అలాగే ప్రభాస్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసిన యోగి సినిమా కూడా 2007 జనవరి 14న విడుదల కాగా ఈ సినిమా మంచి సినిమాగా నిలిచింది. కట్ చేస్తే ముచ్చటగా మూడోసారి ప్రభాస్ సంక్రాంతి సీజన్ కు రాధే శ్యామ్ సినిమా తో వస్తున్నాడు. ఒక బ్లాక్ బస్టర్ హిట్, ఒక యావరేజ్ ను అందించిన జనవరి 14 ఈ సారి ప్రభాస్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇవే కాకుండా ప్రభాస్ చేతిలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి. అందులో దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా విడుదల కానుంది.