ముందుంది ఒక్కటే లక్ష్యం.. హీరోల మధ్య టఫ్ పైట్..!
టాలీవుడ్ 2021పై చాలా ఆశలు పెట్టుకుంది. గతేడాది కరోనాతో దెబ్బ పడినా, ఈ ఏడాది కలిసొస్తుందని ఆశ పడ్డారు. అందుకే సీనియర్లు, టాప్ హీరోలు అంతా పోటీపడి మరీ విడుదల తేదీలు ప్రకటించేశారు. కరోనా లాక్‌డౌన్‌తో ఈ షెడ్యూల్స్ మారిపోయాయి. దీంతో 2022పై ఫోకస్ పెడుతున్నారు స్టార్లు. పవన్ కళ్యాణ్ నుంచి మహేశ్ బాబు వరకు చాలామంది హీరోలు ఇప్పటి నుంచే సంక్రాంతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
పవన్ కళ్యాణ్ వచ్చే సంక్రాంతికి 'హరి హర వీర మల్లు' సినిమాతో వస్తాడని ప్రచారం జరిగింది. కానీ సెకండ్ వేవ్‌తో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ పీరియాడికల్ డ్రామా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు. అయితే పవన్ మాత్రం సంక్రాంతిని విడిచిపెట్టడం లేదు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌ని సంక్రాంతి బరిలో దింపుతానని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.
మహేశ్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'సర్కారు వారి పాట'. బ్యాంక్ స్కామ్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. మోషన్ పోస్టర్‌తోనే బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.
ఫుల్ స్పీడ్‌గా సినిమాలు పూర్తి చేసే అనిల్ రావిపూడి 'ఎఫ్-3' సినిమాని ఆగస్ట్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నాడు. కానీ సెకండ్ వేవ్‌తో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. రీసెంట్‌గానే మళ్లీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది 'ఎఫ్-3' యూనిట్. ఇక దసరా వరకు థియేటర్లు మామూలు పరిస్థితుల్లోకి వస్తే దసరాకి, లేదంటే సంక్రాంతికి 'ఎఫ్-3'ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్.