బ్యాచ్ లర్ హీరోపై మనసు పారేసుకున్న సమంత..

Deekshitha Reddy
హీరో హీరోయిన్లు ఎంత స్టార్ స్టేటస్ కి ఎదిగినా.. కొన్ని కొన్ని కోరికలు వారిలో అలాగే మిగిలిపోయి ఉంటాయి. అలాంటి ఓ కోరికను తాజాగా బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలసి నటించాలని ఉంది అని చెప్పింది. ప్యామిలీ మాన్-2 వెబ్ సిరీస్ తో దాదాపు అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయమవుతోంది సమంత. హిందీ నటీనటులతో కలసి ఈ వెబ్ సిరీస్ చేసిన సమంత ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇప్పుడు బిజీగా ఉంది.




సౌత్ లో ఫేమస్ అయిన తర్వాత దాదాపుగా హీరోయిన్లంతా బాలీవుడ్ వైపు చూస్తుంటారు. అయితే బాలీవుడ్ ఎంట్రీ అందరికీ కలసి రాదు. చాలామంది మళ్లీ వెనక్కు వచ్చేయాల్సిందే, లేదా చిన్నా చితకా అవకాశాలతో అటు బాలీవుడ్ లో కుదురుకోక, ఇటు దక్షిణాది అవకాశాలు పోగొట్టుకుని ఇబ్బంది పడుతుంటారు. ఈ జనరేషన్లో హీరోయిన్లు రెండు పడవలపై కాళ్లు పెడుతున్నారు. దక్షిణాది సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా సత్తా చూపిస్తున్నారు. అయితే సమంత మాత్రం ఇప్పటి వరకూ అలాంటి రిస్క్ చేయలేదు. బాలీవుడ్ పై మోజు పడలేదు. కానీ ఫ్యామిలీ మాన్-2 సిరీస్ ద్వారా సమంత హిందీ ఇండస్ట్రీకి కూడా పరిచయం అవుతోంది. అయితే ఇది కేవలం వెబ్ సిరీస్ మాత్రమే.



తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత బాలీవుడ్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. అవసరమైతే బాలీవుడ్ లో నటిస్తానని చెప్పింది. బాలీవుడ్‌లో ఏ హీరోతో కలి నటించాలనుకుంటున్నారన్న ప్రశ్నకు తడుముకోకుండా రణబీర్ కపూర్ అని చెప్పింది సమంత. అవకాశం వస్తే బాలీవుడ్ లవర్ బోయ్ రణబీర్ తో సినిమా చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. ఇక ఫ్యామిలీమెన్‌ లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ పోషించిన శ్రీకాంత్‌ తివారీ పాత్రను దక్షిణాదిలో ఎవరు చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు నాగార్జున అని బదులు చెప్పింది. తొలిసారి సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఫ్యామిలీ మాన్ -2 సీజన్లో కనిపించబోతోంది. జూన్-4న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ వేదికలో అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: