విభిన్న ప్రేమకథతో ప్రేక్షకుల హృదయాలను దోచేసిన రాంజానా..!

Suma Kallamadi
2013వ సంవత్సరంలో వచ్చిన రాంజానా సినిమాలో హీరోగా ధనుష్ నటించగా హీరోయిన్ గా సోనం కపూర్ నటించారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందిన రాంజానా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో ధనుష్ కనబరిచిన నటనా చాతుర్యానికి బాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. అతి తక్కువ అంచనాల మధ్య విడుదలైన రాంజానా మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చగా.. కొన్ని పాటలను శ్రేయ ఘోషల్ చాలా మధురంగా పాడారు. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. ధనుష్ ని ప్రేమించే మరదలు పాత్రలో స్వర భాస్కర్ చూపించిన నటనా చాతుర్యం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు.


ఈ సినిమాలో హిందువు అయిన కుండన్ శంకర్(ధనుష్) ముస్లిం అయిన జోయా హైదర్ ని తన చిన్నతనం నుంచే చాలా గాఢంగా ప్రేమిస్తాడు. పదోతరగతి చదువుతున్న రోజుల్లోనే తొమ్మిదవ తరగతి చదువుతున్న జోయా చెయ్యి పట్టుకుని మరీ ఎంతో ధైర్యంగా తన ప్రేమను వెల్లడిస్తాడు. ఆ తర్వాత జోయా కూడా కుండన్ ని ఇష్ట పడుతుంది. కానీ ప్రేమించడానికి జోయా అంగీకరించదు. దీంతో కుండన్ జోయా ఎదుట తన చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుంటాడు. అది చూసి చలించిపోయి వెంటనే కుండన్ ని జోయా గట్టిగా హత్తుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకునే ఈ రొమాంటిక్ సన్నివేశం ప్రేక్షకుల మనసులను పులకరింప చేస్తుందంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు బాగా కోప్పడతారు. అనంతరం ఆమెను పై చదువులకు ఢిల్లీ పంపిస్తారు.



ఇక ఆమె మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు కుండన్ ఎదురు చూస్తూనే ఉంటాడు. 8 ఏళ్ల తర్వాత ఆమె తిరిగి వస్తుంది కానీ కుండన్ ని పూర్తిగా మర్చిపోతుంది. దీనితో హీరో మళ్లీ ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అప్పటికే ఆమె ఢిల్లీలో ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ విషయం తెలిసి కూడా కుండన్ జోయా కి సహాయం చేసేందుకు సిద్ధపడతాడు. చివరికి ఆమె కోసం తన ప్రాణాలను సైతం వదులుతాడు. కుండన్ జోయా ని తప్ప మరేతర అమ్మాయిని ప్రేమించలేడు. బిందియా(స్వర భాస్కర్) తనని పెళ్లి చేసుకోమని ఎంత బతిమాలినా కూడా అతను మాత్రం జోయా ని తప్ప మరే అమ్మాయిని చేసుకోను అని కరాఖండిగా చెప్తాడు. కుండన్ - జోయా మధ్య చోటు చేసుకునే ప్రతి ఒక్క ప్రేమ సన్నివేశం నేరుగా హృదయాలను తాకుతుంది. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా రూపొందిన ఈ చిత్రం ఒక మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: