సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?

Chakravarthi Kalyan
సారంగ దరియా సాంగ్.. ఈ ఒక్క పాట ఎన్నో అంశాలపై చర్చకు తెరలేపింది. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. కేవలం 2 వారాల్లోనే 5 కోట్ల వ్యూస్ సంపాదించిన తొలిపాటగా రికార్డు సృష్టిస్తోంది. అయితే ఇదే పాట జానపద గీతాలను సినిమాల్లో వాడకంపై చర్చకు తెరలేపింది. సినీ జీవులు జానపదాలను దోచుకుంటున్నారన్న వాదన మొదలైంది.


ఈ విషయం లోతుల్లోకి వెళ్తే.. సినిమాల్లో జానపదాలవాడకం ఈనాటిది కాదు. గ్రామాల్లో తిరిగి జానపదులు పాడే నందామయా గురుడ నందామయా లాంటి  పాట‌లని ఒక డైరీలో రాసుకుని ఆ పాటల్ని  తన పేరిట క్రెడిట్ వేసుకుని సినిమాలకు అమ్ముకొన్న కొసరాజు రాఘవయ్య నుంచి నాది నక్కిలీసు గొలుసు, సారంగ దరియా లాంటి పాటలతో ఇవాళ సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ లాంటి వాళ్ల దాకా కోట్ల రూపాయల వ్యాపారంగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంత కాలం సాహితి అనేటాయన కూడా ఈ జానపదాల్ని అమ్ముకునేవాడు.


వేల పాటలు రాసిన వేటూరి సైతం... గూడ అంజన్న రాసిన ఊరు మనదిరా పాటను పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా లో తన ఖాతాలో వేసుకోవడం ఘోరం. యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ సాధించిన దారి చూడు దుమ్ము చూడు మామా... రాములో రాములా.... పాటలు కూడా జానపద గీతా‌లే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.


ఈ మొత్తం ప్రక్రియలో జానపదానికి ఒక గుర్తింపు తేవడం కన్నా దాని క్రేజ్ వాడుకొని డబ్బులు సంపాదించడమే ప్రధానంగా కనపడుతుంది. జానపదంలో ఉండే సొగసును చంపి దాన్ని బీట్ తో నింపి కేవలం ఊరేగింపుల్లో తాగి పిచ్చి గంతులు వేయడానికి ఉపయోగపడేలా మార్చుకుంటున్నారు. జనాల క్రేజిని క్యాష్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండే సినీ పరిశ్రమలో ఇప్పుడు జానపద గీతాలు హాట్ కేకుల్లా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: