ఖరారైన దర్శకేంద్రుడి పెళ్ళికూతురు!
పాతికేళ్ళ కిందట పెళ్లి సందడితో హీరో శ్రీకాంత్ కెరీర్‌ని మలుపుతిప్పిన దర్శకేంద్రుడు.. ఇప్పుడు మళ్ళీ కొత్త పెళ్లి సందడితో శ్రీకాంత్ తనయుడు రోషన్ కెరీర్ నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇందులో నటించబోయే హీరోయిన్, నటీనటుల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టారట. ఇప్పటికే శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్‌ని ఓ హీరోయిన్గా తీసుకున్నారని తెలియగా.. మరో హీరోయిన్గా మలయాళ భామ మాళవిక నాయర్‌ని ఓకే చేశారనేది ఇన్సైడ్ టాక్. విజయ్ దేవరకొండ, నాని ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో, అలాగే 'టాక్సీ వాలా' సినిమాలో నటించి తనని తాను ప్రూవ్ చేసుకుంది మాళవిక. ఈ నేపథ్యంలో పెళ్లి సందడిలో మాళవిక అందాలను హైలైట్ చేస్తూ ఆమె కెరీర్ లోనూ ఈ సినిమాను టర్నింగ్ పాయింట్ చేయాలని భావిస్తున్నారట రాఘవేంద్ర రావు. ఇదే గనక నిజమైతే కెరీర్ పరంగా ఇక మాళవిక వెనుకకు తిరిగి చూడాల్సిన అవరసరమే రాకపోవచ్చు. ఈ మోడ్రన్ పెళ్లి సందడికి రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహించనున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో రాఘవేంద్ర రావు సోదరుడు కె. కృష్ణమోహన్ రావు నిర్మించనున్నారు. అలాగే అప్పట్లో తనదైన బాణీలతో పెళ్లి సందడి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన కీరవాణి మరోసారి తన సంగీతంతో ఆకట్టుకోనున్నారు.