నవ్వించే వాళ్లే కరువయ్యారా..?

NAGARJUNA NAKKA
ఏదీ ఎవ్వరి కోసం ఆగదు అంటారు గానీ, బ్రహ్మానందం స్లో అయ్యాక టాలీవుడ్‌కి ప్రామినెంట్ కమెడియన్ కరువయ్యాడు. ఒక్క డైలాగ్‌ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించే బ్రహ్మీ లాంటి కమెడియన్లు కనిపించడం లేదు అంటున్నారు మేకర్స్.
టాలీవుడ్‌ కామెడీ ట్రాక్స్‌ని కొన్ని దశాబ్ధాల పాటు ముందుండి నడిపించాడు బ్రహ్మానందం. జనరేషన్లు మారినా హీరోలు మారినా చాన్నాళ్లు కామెడీ ట్రాక్స్‌కి హీరోగా నిలిచాడు బ్రహ్మీ. అయితే వయసు పెరిగాక మునపటిలా సినిమాల్లో కనిపించడం లేదు బ్రహ్మానందం.
వింత వింత మాటలతో నవ్వించే అలీ అన్ని సినిమాలని కవర్ చేయలేకపోతున్నాడు. కాల్షీట్స్‌ని ఎక్కువ సినిమాలకు సర్దలేకపోతున్నాడు. పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేస్తున్నాడు అలీ. దీంతో అలీ అనుకున్న చాలామంది దర్శకనిర్మాతలు వేరే ఆప్షన్‌ కోసం వెతుక్కుంటున్నారు.
హీరో నుంచి మళ్లీ కమెడియన్‌గా మారిన సునీల్ ఇప్పుడు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కొత్త ఇన్నింగ్స్ లో పాత జోష్‌ చూపించలేకపోతున్నాడు. 'అరవింద సమేత, అల వైకుంఠపురం' లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా మార్క్ చూపించలేకపోయాడు. ఇక 'డిస్కోరాజా' తర్వాతి నుంచి విలన్‌ క్యారెక్టర్లు కూడా చేస్తున్నాడు. దీంతో చాలామంది దర్శకనిర్మాతలకు సునీల్‌ ఫస్ట్‌ ఆప్షన్‌గా కనిపించట్లేదట.
కమర్షియల్ సినిమాలో హీరోయిజానికి ఎంత స్కోప్ ఉంటుందో కామెడీకి అంతే ప్రియారిటీ ఉంటుంది. అందుకే ఎంతమంది కమెడియన్స్ వచ్చినా ప్లేస్ ఉంటుందని చెప్తారు. అయితే ఇప్పుడొస్తున్నా చాలామంది కుర్రాళ్లు ప్రేక్షకులను నవ్వించలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి.
'ప్రేమకథా చిత్రమ్'తో బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్న సప్తగిరి, ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. కామెడీ రోల్స్‌ తగ్గించి, మెయిన్‌ లీడ్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ఇక షకలక శంకర్ కూడా ఇలాగే హీరోయిజంపై ఆశపెట్టుకున్నాడు. ఫైట్లు, స్టంట్లు చేస్తూ కామెడీ వేషాలు తగ్గించాడు.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా నవ్విస్తోన్న నటుడు వెన్నెల కిశోర్. స్టార్‌ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోన్న వెన్నెల కిశోర్ చాలా బిజీగా ఉంటున్నాడు. దీంతో ఇతని కాల్షీట్ కావాలంటే చాలా రోజులు వెయిట్‌ చెయ్యాల్సిన పరిస్థితి అంటున్నారు సినీ జనాలు. పోనీ మరొకరితో కానిద్దం అంటే కష్టంగా ఉందని చెబుతున్నారు.

తాగుబోతు రమేశ్, శ్రీనివాసరెడ్డి లాంటి కమెడియన్ల హవా కూడా తగ్గిపోతోంది. వీళ్లు ఇంతకుముందులా నవ్వించలేకపోతున్నారు. ప్రవీణ్, సత్యలాంటి కమెడియన్లు వరుసగా మేజిక్‌ చెయ్యలేకపోతున్నారు. దీంతో టాలీవుడ్‌కి ఓ కొత్త కమెడియన్ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు మేకర్స్. మరి వీళ్ల రిక్వైర్‌మెంట్స్ తీర్చే కమెడియన్ ఎప్పటికి దొరకుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: