2018వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలసి గీతా గోవిందం సినిమాలో మొదటిసారిగా జతకట్టారు. ఈ రొమాంటిక్ డ్రామా టాలీవుడ్ పరిశ్రమలో అతి పెద్ద హిట్ గా నిలిచి వారిద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ విజయ్ తో డియర్ కామ్రేడ్ సినిమా లో జతకట్టిన రష్మిక మందన అందరి కళ్ళు తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో ఆమె నటించిన లిల్లీ పాత్ర హైలెట్ గా నిలిచింది. డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్, రష్మిక మధ్య కొనసాగే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను వెండితెరకి కట్టిపడేశాయి. వీరిద్దరి మధ్య కొనసాగే కెమిస్ట్రీ ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుందని చెప్పుకోవచ్చు.
సినీ అభిమానులు విజయ్, రష్మిక కలిసి మరొక సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే అతి త్వరలోనే వారి కోరిక కొంతమేరకు తీరనున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఒక బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం జతకట్టబోతున్నారు. నివేదికల ప్రకారం... ఒక ప్రముఖ బట్టల కంపెనీని ప్రచారం చేయడానికి రష్మిక, విజయ్ కలసి ఒక ప్రకటనలో కనిపించనున్నారట. 'మేము ఈ కంపెనీ వస్త్రాలను ధరిస్తున్నాం. ఇవి మాకు బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాము. ఒకసారి మీరు కూడా ఈ వస్త్రాలను కొనుగోలు చేయండి', అని విజయ్ దేవరకొండ రష్మిక మందన ఒక ప్రకటనలో చెప్పడానికి అంగీకరించారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
అయితే ఈ ప్రకటన అతి త్వరలోనే విడుదల కానున్నదని సమాచారం. వెండితెర పై కాకపోయినా కనీసం బుల్లితెరపై అయినా తమ ప్రియమైన హీరో హీరోయిన్ల ను జంటగా చూసే అవకాశం త్వరలోనే రావడమనేది అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అతి సమీపంలోనే వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని, మన అందరిని అలరించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.