బాలీవుడ్ మోజంతా తెలుగు సినిమాల పైనే.. !
తెలుగు సినిమాలు బాలీవుడ్ కు వెళ్లడం. హిందీ సిినిమాలు ఇక్కడకు రావడం కామనే అయినా.. ఈ మధ్యకాలంలో.. తెలుగులో హిట్ అయిన 10సినిమాల్లో ఐదింటిని హిందీ వాళ్లు తీసుకెళ్లిపోతున్నారు. తెలుగులో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. హిట్స్ ఏంటని ఆరా తీస్తున్నాయి బాలీవుడ్ వర్గాలు. పది తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ కావడం విశేషం.
తెలుగు వాళ్లు ముంబయి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా అక్కడ విలయతాండవం చేస్తోందీ. కానీ మన సినిమాలు మాత్రం ముంబై ఫ్లైట్ ఎక్కి ఎంచక్కా దర్జాగా వెళ్లిపోతున్నాయి. ఆల్ రెడీ మన సినిమాల హిందీ అనువాదాలు యు ట్యూబ్ లో రిలీజై.. రికార్డు స్థాయిలో మిలియన్ వ్యూస్ అందుకున్నాయంటే.. మన మాస్ మసాలా చిత్రాలకు హిందీలో ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతోంది.
సరైనోడు హిందీ డబ్బింగ్ తో ఇండియా వైడ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ హిందీ అనువాదాన్ని యు ట్యూబ్ లో 30కోట్ల మంది చూశారు 300 మిలియన్ వ్యూస్ దాటిన తొలి ఇండియన్ మూవీ మన తెలుగు సినిమా కావడం విశేషం. బన్నీ పుష్పతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టడానికి సరైనోడు హిందీ డబ్బింగ్ కు వచ్చిన వ్యూస్ ఒక కారణమే.
హిందీ అనువాదాలతో రామ్ కూడా సత్తా చాటుతున్నాడు. ఏ హీరోకూ లేనన్ని నాలుగు హిందీ డబ్బింగ్ మూవీస్ 100 మిలియన్ మార్క్ దాటేశాయి. నేను శైలజ హిందీలోకి ది సూపర్ ఖిలాడి 3పేరుతో డబ్ అయితే. 220 మిలియన్ మార్క్ తో దూసుకుపోతోంది. ఈ లెక్కన రామ్ పాన్ ఇండియాలోకి అడుగు పెట్టేందుకు ఇంకా ఎంతో టైమ్ తీసుకోడేమో.
తెలుగు సినిమాలు బాలీవుడ్ ను కిక్ ఎక్కిస్తున్నాయి. బాహుబలి సిరీస్ ఘన విజయంతో.. బాలీవుడ్ తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కాలంలో హిట్టయిన సినిమాలనే కాదు.. పదేళ్ల క్రితం వచ్చిన మెప్పించిన సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు.
బాహుబలితో పాటు.. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తెలుగు సినిమాను హిందీలో నిలబెట్టింది. కబీర్ సింగ్ తో షాహీద్ కపూర్ ఫస్ట్ టైమ్ 300కోట్ల క్లబ్ లో చేరాడు. తెలుగు సినిమాపై ఉన్న నమ్మకంతో జెర్సీ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో నాని నటించిన జెర్సీ తెలుగులో మంచి విజయం సాధించింది. అల్లు అరవింద్, దిల్ రాజు.. ఈ సినిమాను బాలీవుడ్ కు తీసుకెళ్లారు.
అర్జున్ రెడ్డి తర్వాత హిందీలోకి వెళ్తున్న విజయ్ దేవరకొండ మరోసినిమా టాక్సీవాలా. కారు చుట్టూ తిరిగే ఈ హారర్ థ్రిల్లర్ హిందీలో ఖాళీ పీలి పేరుతో రీమేక్ అవుతోంది. ఇషాన్ ఖట్టర్ హీరోగా.. అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మక్బూల్ ఖాన్ దర్శకుడు.