కృష్ణతో, మహేష్ బాబు మూవీ ఉంటుందట ......కానీ .....??
సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ, ఇప్పటివరకు తన కెరీర్ లో మొత్తం 350కి పైగా సినిమాల్లో నటించారు. వాటిలో దాదాపుగా తొంభై శాతానికి పైగా సినిమాల్లో హీరోగా నటించి వాటిలో ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకున్న కృష్ణ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకానొక సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కు పెద్ద పోటీ ఇచ్చిన కృష్ణ, ఆయన సినిమాలతో పాటు పోటీ పడి మరీ తన సినిమాలు రిలీజ్ చేసి, అందులో చాలా విజయాలు దక్కించుకున్నారు. తనకు వయసు మీదపడుతున్న సమయంలో పెద్ద కొడుకు రమేష్ బాబు ను హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేసిన కృష్ణ, ఆయనను హీరోగా పెట్టి పలు సినిమాలు నిర్మించారు. అయితే కాలం కలిసిరాక రమేష్ మాత్రం, తండ్రి ఆశించిన రేంజ్ లో హీరోగా సక్సెస్ కాలేకపోయారు. అంతకముందు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి చిన్నతనంలోనే మంచి పేరు దక్కించుకున్న మహేష్ బాబు, ఆ తరువాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ కొట్టిన మహేష్, అక్కడి నుండి ఒక్కో సినిమాతో పలు విజయాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ గర్వించదగ్గ అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
అయితే మొదటి నుండి కృష్ణ, మహేష్ ల ఫ్యాన్స్ కు ఉన్న కోరిక ఒక్కటే, వారిద్దరూ కలిసి ఒక మంచి హిట్ మూవీ చేస్తే చూడాలని వారు ఆశపడుతున్నారు. రాజకుమారుడు మూవీలో మహేష్ తండ్రిగా నటించిన కృష, ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ ఎపిసోడ్ లో కొద్దిసేపు కనిపిస్తారు. రాజకుమారుడు సక్సెస్ అయినా, అందులో మహేష్, కృష్ణ ఇద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలు ఉండవు. ఆ తరువాత వంశీ మూవీలో మహేష్ కు మావయ్యగా నటించిన కృష్ణ, ఆయనతో కలిసి కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తారు. అయితే ఆ సినిమా మాత్రం పరాజయం పాలయింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపించింది లేదు. అయితే వీరిద్దరి సినిమా విషయమై కొద్దిరోజుల నుండి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించే సినిమాకు సంబంధించి అగ్ర దర్శకడు ఒకరు మంచి కథ సిద్ధం చేసారని, ఆ సినిమాలో మహేష్ తో కలిసి కృష్ణ నటించే సీన్స్ ఎంతో అదిరిపోతాయని, అయితే ఇటీవల విజయనిర్మల హఠాన్మరణంతో ఎంతో కృంగిపోయిన కృష్ణ, ఆ పాత్రలో నటించగలరా లేదా అని భావించి, ఆ స్క్రిప్ట్ ని ప్రక్కన పెట్టాడట సదరు దర్శకుడు.
ఇక ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆ స్క్రిప్ట్ లో కొద్దిపాటి మార్పులు చేసిన సదరు దర్శకుడు, అందులో కృష్ణ పాత్రను కొంత కుదించారని, ఆయన స్క్రీన్ పై కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ, సినిమా మొత్తానికి ఆ పాత్ర ఎంతో పెద్ద హైలైట్ అని అంటున్నారు. అన్నీ కలిసివస్తే రాబోయే మరికొద్దిరోజుల్లో ఆ స్క్రిప్ట్ ని మహేష్, కృష్ణ లకు విన్పించి, మంచి సమయం చూసుకుని సినిమా మొదలెట్టాలని చూస్తున్నారట. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం, ఎన్నో ఏళ్ల నుండి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే స్క్రీన్ పై కలిసి నటించడం చూడాలని భావిస్తున్న వారి ఫ్యాన్స్ కు ఇది మంచి పండగ వార్త అని చెప్పకతప్పదు.....!!