తెలుగులోనే కాదు.. ఆ భాష‌ల్లోనూ `పోకిరి` సూప‌ర్ డూప‌ర్ హిట్టే!!

Kavya Nekkanti

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ కాంబినేష‌న్‌లో వచ్చిన చిత్రం `పోకిరి`. ఇలియానా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2006లో విడుద‌లై.. బాక్సాఫిస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించింది. పూరి జగన్నాథ్ రాసిన మాటలు, ఆయన టేకింగ్‌తో పాటు మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్, ఇలియానా గ్లామర్ ప్రేక్షకులను బాగా ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతోనే మ‌హేష్ మాస్ హీరోగా అవ‌తారం ఎత్తాడు. అటు ఇలియానా కూడా ఈ సినిమాతో  ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అలాగే టాలీవుడ్‌లో పోకిరి విజయం ఓ సునామీ లాంటి వాతావరణాన్ని సృష్టించింద‌నే చెప్పాలి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. మగధీర చిత్రం విడుదల ముందు వ‌ర‌కు భారీ  షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా `పోకిరి` రికార్డులకు ఎక్కింది. అంతేకాదు, టాలీవుడ్‌ను మెగాస్టార్ చిరంజీవి పాలిస్తున్న రోజుల్లో ఆయనకు సాధ్యం కాని కలెక్షన్లను పోకిరి వసూలు చేసిందంటే.. ఈ చిత్రం ఏ రేంజ్‌లో హిట్ అయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ చిత్రంలో ప్ర‌తి డైలాగ్ హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు`, `ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను` లాంటి డైలాగ్స్ అయితే ఇప్ప‌టికీ సగటు ప్రేక్షకుడి నాలికపై నాట్యం చేస్తుంటాయి. ఇక ఈ చిత్రం తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో `పోక్కిరి` అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో `వాంటెడ్` అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా `పోర్కి` అన్న పేరుతో, బెంగాలీలో షకీబ్ ఖాన్ హీరోగా `రాజోట్టో` పేరుతో రీమేక్ చేశారు. విచిత్రం ఏంటంటే.. అన్ని భాష‌ల్లోనూ పోకిరి చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచి.. భారీ కలెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: