ఏటీటీ ద్వారా మీ కేబుల్ టీవీ లోనే నేరుగా సరికొత్త సినిమాలు చూసేయొచ్చు..!

Suma Kallamadi

భారతీయ సినీ ప్రేక్షకులు ఇప్పటివరకు ఓటీటీ లో మాత్రమే కొత్త సినిమాలు వీక్షించారు కానీ ఎప్పుడైతే రాంగోపాల్ వర్మ మియా మాల్కోవా తో రూపొందించిన క్లైమాక్స్ సినిమా శ్రేయాస్ ఈటీ యాప్ లో విడుదల చేసాడో అప్పటినుండి ఏటీటీ... ఎనీ టైం థియేటర్ అనే ఒక సరికొత్త టెక్నాలజీ ప్రేక్షకులకు తెలిసింది. కొత్త సినిమాలను ఓటీటీ లో చూడాలంటే ప్రేక్షకులు సంవత్సర వార్షిక చంద కట్టి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఏటీటీ లో అయితే కొత్త సినిమా చూడాలనుకున్న ప్రేక్షకుడు కేవలం ఆ సినిమా చూసేందుకు డబ్బులు చెల్లించితే సరిపోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఒక్క సినిమా చూడాలన్నా... ముందస్తుగా నెలసరి చందా లేదా వార్షిక చందా కట్టాల్సి ఉంటుంది. ఐతే కొంతమంది ప్రేక్షకులు ఈ వార్షిక చందా కి, నెలసరి చందా కి డబ్బులు కట్టడానికి ఇష్టపడరు. అటువంటి వారి కోసమే ఎటీటీ ప్లాట్ ఫామ్ తెరపైకి వచ్చింది. ఏటీటీ అనేది పేపర్ పర్ వ్యూ విధానాన్ని పాటిస్తుంది. 


ఇటీవల మీడియాతో మాట్లాడిన నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ ఏటీటీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియపరిచారు. తాను మాట్లాడుతూ... ' ప్రేక్షకులంతా బడా హీరోల సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వెళ్తున్నారు కానీ తక్కువ బడ్జెట్ తో చిన్నపాటి స్థాయి తారాగణంతో రూపుదిద్దుకున్న మంచి సినిమాలను థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితి. అటువంటి చిత్రాలను ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు మేము శ్రేయాస్ ఈటీ ద్వారా ఆన్లైన్ మల్టీప్లెక్స్ తెరను చిన్నపాటి చిత్ర బృందాలకు సమర్పిస్తున్నాం. ఈ తెర ద్వారా వారు తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు నేరుగా తీసుకురావచ్చు. తమ సినిమాల కి వారే ప్రత్యేకమైన ధర నిర్ణయించుకోవచ్చు. వారు విడుదల చేసిన సినిమాలకు మధ్యలో ప్రసారమయ్యే ప్రకటనల ద్వారా వచ్చే డబ్బులు కూడా నిర్మాతలే ఉంచుకోవచ్చు', అని ఆయన అన్నారు. 


తాను ఇంకా మాట్లాడుతూ దక్షిణాది భాషల్లో రూపుదిద్దుకున్న సినిమాలు కూడా విడుదలయ్యేందుకు తమ యాప్ లో తెరలు ఉన్నాయని... జులై నెల నుండి ప్రేక్షకులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ లతోపాటు డిస్కౌంట్ పై నేరుగా ఇంటికి ఆహారం అందించే సదుపాయం కూడా కల్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తమ యాప్ లో డబ్బులు చెల్లిస్తే ఇంటర్నెట్ లేకపోయినా కేబుల్ టీవీ లో సినిమాలు చూసే సదుపాయం కూడా కల్పించబోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కేబుల్ టీవీ లో సినిమాలు ప్రసారం చేసేందుకు ఇప్పటికే రెండున్నర లక్షల కేబుల్ టీవీ లతో టై అప్ అవుతున్నామని ఆయన వెల్లడించారు. ఇలాంటి ప్రయత్నం చేయడం ప్రపంచంలోనే మొదటిసారి అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: