ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి చిత్రం విడుదలవుతే అభిమానులకు పండగే..?
దివంగత కథానాయకుడు ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఉదయ్ కిరణ్ నటించిన వరుసగా నటించిన సినిమాలయిన చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచి అతడిని హ్యాట్రిక్ హీరోగా చేశాయి. అయితే ఉదయ్ కిరణ్ చివరిగా 'చిత్రం చెప్పిన కథ' సినిమాలో నటించారు. ఈ చిత్రానికి అమరనేని రమేష్ కథ అందించగా... మోహన్ అలర్కు(Mohan ALRK) దర్శకత్వం వహించాడు. 'చిత్రం చెప్పిన కథ' ఒక హారర్ థ్రిల్లర్ సినిమా కాగా... సినిమా షూటింగ్ మొత్తం ఒక ఇంటిలోనే పూర్తి చేసారట. సిహెచ్ మున్నా ఈ సినిమాని నిర్మించగా... మున్నా కాశీ సంగీత బాణీలను అందించాడు. మదాలస శర్మ ఉదయ్ కిరణ్ హీరో హీరోయిన్లుగా నటించిన 'చిత్రం చెప్పిన కథ టీజర్' చాలా సంవత్సరాల క్రితమే విడుదల కాగా... 2017లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు కానీ ఏవో కారణాల వల్ల అది వాయిదా పడింది.
ఉదయ్ కిరణ్ మరణించినప్పటికీ అతను మాత్రం తెలుగు ప్రేక్షక అభిమానుల హృదయాల్లో బతికే ఉంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వారంతా ఉదయ్ కిరణ్ పై ప్రేమతో అతను చివరి గా నటించిన సినిమాని వెండి తెరపై చూడాలని బాగా ఆశపడుతున్నారు. కానీ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో థియేటర్లలో ఏ సినిమాని విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పవచ్చు. అయితే ఈ రోజుల్లో చాలా సినిమాలు ఓటిటీ ప్లాట్ ఫామ్ లలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్, అమితాబచ్చన్, జ్యోతిక నటించిన పలు సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో లో నేరుగా విడుదలయ్యాయి. గోపీచంద్ హీరోగా నటించిన ఆరడుగుల బుల్లెట్టు, సందీప్ కిషన్ నటించిన డీకే బోస్ చిత్రం కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ పై విడుదల కానున్నాయి.
అయితే ఇప్పటి వరకు విడుదల కానీ 'చిత్రం చెప్పిన కథ' కూడా ఓటిటి లో రిలీజ్ కాబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జూన్ 26వ తేదీన ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు కాగా... ఆరోజు ఉదయ్ కిరణ్ చివరి గా నటించిన సినిమాని విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా చాలా ఏళ్లు గడుస్తున్నా ఎప్పటికీ రిలీజ్ కానీ తమ చిత్రాలను ఎంతో కొంత రేట్ కి ఓటీటీ లకు విక్రయించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తుంది.