'అల వైకుంఠపురములో'......ఆ సాంగ్ లోనే సినిమా స్టోరీ....??
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ సినిమా అలవైకుంఠపురములో. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా పలు ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఆయన తండ్రిగా మురళి శర్మ నటిస్తున్నారు. సునీల్, నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, టబు, సుశాంత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా స్టోరీ పై ఇప్పటికే కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి.
కాగా నేడు ఈ సినిమా స్టోరీ లైన్, నిన్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన 'ఓ మై గాడ్ డాడీ' అనే సాంగ్ లో ఉందని అంటున్నారు. మంచి ట్రెండీ స్టయిల్లో, వెస్ట్రన్ బీట్ తో నలుగురు యువ సింగర్స్ ఆలపించిన ఆ సాంగ్ యొక్క లిరిక్స్ ని బట్టి చూస్తే, అది తండ్రి మరియు కొడుకులు మధ్య జరిగే కొద్దిపాటి గొడవలను గుర్తు చేస్తుంది. కాగా ఈ సినిమా కథలోని ప్రధాన పాయింట్ అదేనని, ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన హీరో, అతని తండ్రి మురళి శర్మ పెట్టె ఇబ్బందులు తాళలేక కొన్నిసమస్యలు ఎదుర్కొంటాడని, అయితే అనుకోకుండా అతని తండ్రికి ఎదురయ్యే సమస్యకి కొడుకు అయిన బన్నీ ఎదురుగా నిలిచి ఏ విధంగా దానిని ఛేదించాడు అనేది ఈ సినిమా మూల కథగా ప్రచారం అవుతుంది.
ఇక హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ఈ సినిమాలో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో గా నటిస్తుంటే, ఆమె కంపెనీలో పనిచేసే ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా బన్నీ కనపడనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో టబు, బన్నీకి అక్కగా నటిస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా అసలు ఈ సినిమా కథ ఇదేనా లేక కాదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఓపికపట్టాల్సిందే. కాగా ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్.....!!