‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని గత రెండు సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా ప్రయత్నిచాయి. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఆ సినిమాలు ఎంత భారీ బడ్జెట్ తో తీసినా వాటికి ఘోర అవమానమే ఎదురౌతోంది. దీనితో ‘బాహుబలి’ రికార్డులను కనీసం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ అయినా బ్రేక్ చేయగలుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
‘
బాహుబలి’ కధలో భావోద్వేగాలతో పాటు టెక్నికల్ బ్రిలియన్స్ ఆ సినిమాకు అలాంటి ఘనవిజయంతో పాటు సుస్థిర స్థానాన్ని ఏర్పరిచింది. ఇలాంటి పరిస్థితులలో ‘బహుబలి’ కి పనిచేసిన టీమ్ అంతా మళ్ళీ అతి త్వరలో కలవబోతోంది. ‘బాహుబలి’ తరువాత ఈ టీమ్ లోని వారందరూ ఎవరికి వాళ్లు వేరే సినిమాల వైపు వెళ్లిపోయారు.
అయితే ఇప్పుడు ఈ టీమ్ అంతా ఈ నెల 19న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగే ఒక వేడుకలో కలవబోతున్నారు. అక్కడ ఆరోజు ‘బాహుబలి’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో ‘హ్యారీపోటర్’ సహా అనేక ప్రఖ్యాత సినిమాలు ఆరోజు ప్రదర్శితం కానున్నాయి.
వాటి సరసన ‘బాహుబలి’కి చోటుదక్కడం గొప్ప ఘనతగా భావించి ‘బాహుబలి’ టీమ్ మొత్తం ఆ వేడుకలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ప్రభాస్ తో పాటు రాజమౌళి రానా అనుష్క తమన్నా కీరవాణి శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని ఇలా ఈ మూవీకి పనిచేసిన వారు అంతా ఒక చోట కలిసి సందడి చేయబోతున్నారు. ‘సాహో’ పరాజయం షాక్ లో ఉన్న ప్రభాస్ అనారోగ్య సమస్యలనుండి తేరుకున్న రానా ‘ఆర్ ఆర్ ఆర్’ టెన్షన్ మధ్య మధ్య సతమతమైపోతున్న రాజమౌళి తమ కష్టాలను మరిచిపోయి ‘బాహుబలి’ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ తిరిగి పాజిటివ్ ఎనర్జీ పొందడానికి ఈ లండన్ మీట్ వారికి ఎంతోసహా పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..