సైరా సినిమాకు ముందు తన తండ్రికి లైఫ్‌లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తున్నానంటూ నిర్మాత రామ్‌చరణ్ ప్రమోషన్లలో తెగ ఊదరగొట్టేసుకున్నాడు. ఇక రాజమౌళి, అల్లు అరవింద్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సీనియర్లు, సెలబ్రిటీలు, హీరోలు చిరుకు కొడుకు రామ్‌చరణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడంటూ ఆకాశానికి ఎత్తేశారు.
చివరకు తన భార్య సురేఖ సైతం ఈ సినిమాకు మీకు అదిరిపోయే గిఫ్ట్ అండి.. మనకు డబ్బు ముఖ్యం కాదు.. పేరు ప్రఖ్యాతులు అవి మనకు సైరాతో వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పిందని కూడా చిరు స్వయంగా చెప్పారు. మరి అంత పేరు ప్రఖ్యాతుల కోసమే సైరా తీసినప్పుడు నిజంగానే అవుట్ ఫుట్ అలా ఉందా ? అన్నది పరిశీలిస్తే ఖచ్చితంగా అలా లేదనే చెప్పాలి.
అసలు సైరాలో వాస్తవికతకు ఎక్కడ ? చోటు ఉంది. అంతా కల్పిత.. ఊహాజనిత గాధే. ఇక చిరు తన తనయుడు రామ్‌చరణ్ కెరీర్‌లో ఎదిగేందుకు ప్రజారాజ్యం టైంలో బిజీగా ఉన్నప్పుడు కూడా మగధీర లాంటి టాప్ హిట్‌ను కొడుకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ రోజు ఆ సినిమా లేకపోయి ఉండి ఉంటే రామ్‌చరణ్ ఖచ్చితంగా స్టార్ హీరో అయ్యి ఉండేవాడు కాదు. ఆ సినిమాతోనే చెర్రీకి మార్కెట్ వచ్చింది.
ఇక ఇప్పుడు తన తండ్రికి తాను రుణం తీర్చుకుంటున్నానని.. జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ డాడీకి ఇస్తున్నానని చెప్పిన చరణ్ మంచి కథ, కథనాలతో సైరా సినిమా తీసి అందరి ప్రశంసలు పొంది ఉంటే నిజంగా అది అటు చెర్రీకి, ఇటు చిరుకు గర్వకారణమే. అయితే కేవలం డబ్బు కోసం, బిజినెస్ కోసం ఫక్తు కమర్షియల్ చట్రంలో సినిమాను ఇరికించేసి ఇప్పుడు డాడీకి ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టుగా ప్రచారం జరుగుతుండడం చాలా మందికి నచ్చలేదు.