తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున నట వారసుడిగా ‘జోష్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. కానీ ఆ చిత్రం సరైన ఫలితం ఇవ్వలేక పోయింది..ఆ తర్వాత ‘ఏం మాయ చేసావే’ చిత్రం అద్భుతమైన విజయం అందుకుంది. అప్పటి నుంచి నాగచైతన్య లవర్ బాయ్ గా పలు చిత్రాల్లో నటించాడు. ఈ చిత్రంలో నటించిన సహనటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహనాంతరం ఈ జంట కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘మజిలి’. ఈ చిత్రానికి 'నిన్ను కోరి' ఫేమ్ శివనిర్వాన దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం సమంత, చైతూలకి నాలుగో చిత్రం. ఈ క్రేజీ కాంబినేషన్‌ను తన కథతో మరింత క్రేజీగా మార్చేస్తున్నారు దర్శకుడు. కొన్ని రోజులుగా వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తైపోయింది. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఆ మద్య ఈ జంటకు సంబంధించిన షూటింగ్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. ఈ రోజున నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అయితే ఈ చిత్రం 1980 నాటి కథా వస్తువుతో రూపొందుతోంది. అందువల్లనే ఈ పోస్టర్లో చైతూ స్కూటర్ పై కనిపిస్తున్నాడు. ఇంతవరకూ ఈ తరహా కథను గానీ .. పాత్రలను గాని చేయకపోవడం వల్లనే సమంత - చైతూ వెంటనే అంగీకరించారట. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్గా నటిస్తున్నారు.
తణికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కష్ణమురళి, సుబ్బరాజు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్లో సాహు గరపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జంటను మళ్లీ తెరపై చూడాలనే కుతూహలంతో అభిమానులు వున్నారు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేని నాగచైతన్యకు ఏపిహెరాల్డ్.కామ్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు