మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం

మన సినిమావాళ్ళ జీవితాలు మేడిపడ్ల లాంటివి. పొట్ట విచ్చి చూస్తేనే పురుగులు కనిపిస్తాయి. అందుకే వాటి పొట్ట విప్పి చూడగూడదు. ఏదేలా ఉన్నా నటులుగా వాళ్లను అభిమానిస్తూనే ఉంటాం. వాళ్ళు నార్కోటిక్స్ కేసుల్లో ఇరుక్కున్నా, తాగి కార్లు నడిపినా, విదేశాల్లో అసాంఘిక శృంగార కార్యక్రమాలు జరిపినా, కాస్టింగ్ కౌచ్ లలో అమ్మాయిలను మోసం చేసినా  – వారి సెలబ్రిటీ స్టేటస్ కు భంగం కలగకుండా మన అభిమానం మాయలో కప్పేసి కాపాడతాం. ఒకే అంటూ వదిలేస్తాం. 


సామాజిక సమస్యపై వీళ్ళు స్పందించే తీరు వైవిధ్యం. ఉదాహరణకు మిర్యాలగూడలో జరిగిన “పరువు” హత్యపై కొంతమంది తెలుగు సినిమా హీరోలు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు ఆవేశ కావేశాలు  హాస్యాస్పదంగా తయారౌతున్నాయి. కూతురు ప్రేమించి పెళ్ళి చేసుకున్న అల్లుణ్ని – హత్య చేయటం నిర్ద్వందంగా క్షమార్హం కాని నేరం. ఆ యువకుడి పట్ల వీళ్లు సానుభూతి వ్యక్తం చేయడం ముదావహం. ఆ సందర్భంగా వీళ్ళు రెచ్చిపోయి చేసే ప్రసంగాలు, చెప్పే ప్రవచనాలు, సమాజంపట్ల వీళ్ళు వ్యక్తం చేసే భావనలు - ‘అసలు ఈ సమాజం ఏమైపోతోంది?’ అంటూ వీళ్లు వ్యక్తం చేసే ఆవేదన ప్రపంచానికి తెలిసిన వీళ్ళ కుటుంబ చరిత్రలతో అవలోకిస్తే నిజంగా అసహ్యం పుడుతుంది. వీళ్ళు ట్విట్టర్ “ప్రేమకు సరిహద్దులు లేవు” అని హ్యాష్ ట్యాగులు పెడుతుంటారు. “ప్రణయ్ కి న్యాయం జరగాలి” అని కూడా మరో హ్యాష్ ట్యాగ్ పెడుతుంటారు ఇక్కడి వరకూ మనం సరే అని సర్దుకుందాం.  

అయితే ఈ పరువు హత్య విషయంలో వీళ్లు స్పందించటం వరకూ ఒకే, అది కూడా అభినందనీయమే. ఈ కథానాయకులు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్లే. అయితే, వీళ్ళు చేసుకున్న కులాంతర వివాహాల కుటుంబాల నేపధ్యం ఏమిటి? వారితో వియ్యం అందుకున్న వారి ఆర్ధిక సామాజిక రాజకీయ నేపధ్యం ఏమిటి? అది ప్రధాన ప్రశ్న.  అలాంటి విషయాలు మాత్రం ఇప్పుడు గుర్తుకు రావటంలేదు వారికి. "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అన్న అర్ధశాస్త్రమూలం వీరిపట్ల 100% నిజం కాదని ఏవరైనా అనగలరా? 


ఈ కథానాయకుల అక్కలు చెల్లెళ్లు, కులాంతర వివాహాలు చేసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు, వీళ్లను కాదని కుటుంబం మొత్తాన్ని ఎదురించి "డిల్లీ నుండి హైదరాబాద్"  వరకు దేశం మొత్తం మన్నూ మిన్నూ ఏకం చేసి వేరే కులానికి చెందిన వారిని అదీ అగ్ర కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నప్పుడు జరిగిన తతంగం తెలుగు జాతికి మొత్తం తెలుసు. భాగ్యనగర వాసులకు ఆ చరిత్ర కరతలామలకం. ఏం జరిగింది? ఎవరికైనా ఎప్పుడైనా గుర్తుకు రాకమానదు. “అసలు ఈ సమాజం ఏమైపోతోంది?” అని వేదనాభరిత ఆందోళన వ్యక్తం చేస్తున్న వీరు, గతంలో తమ ఇంటి కూతుళ్ళు కుటుంబ సంకెళ్ళు చేధించుకొని బయటకు వెళ్లి, అదే బోయినపల్లి ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నప్పుడు – బజార్నపడ్డప్పుడు – మీది కుల దురహంకారం కాదా? అదీ విద్యావంతులు, అగ్ర కులానికి చెందిన వాళ్ళను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మీ తీరు ఏలా ఉందో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంపూర్ణంగా తెలుసు మీరేం చేశారనేది?

మా బాబాయ్ తుపాకీలు పట్టుకుని మమ్మల్ని చంపేస్తాడు,  అని వీరింటి కూతుళ్ళు పోలీస్ స్టేషన్లో  పిర్యాద్దులు చేయలేదా? చివరకు అలా జరిగిన కులాంతర వివాహం చివరకు పెటాకులు కాలేదా?  అదీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరవాత కూడా.  ఆ పెళ్ళి జరిగిన తరవాత మీ అమ్మాయితో సఖ్యత నెరపి పెళ్లి పెటాకులు అయ్యేంత వరకు నిద్రపోలేదు కదా! మీ చరిత్ర ఒక సారి మీ ఫ్లాష్ బాక్ లో నేమరు వేసుకోండి. అంత కన్నా ముందు అదే ఇంటి ఫ్రథమ పుత్రిక కులాంతర వివాహ నిశ్చితార్థం ఎక్కడకు వెళ్లిందో? అదీ ఒక హీరోగా స్వంతంగా ఎదుగుతున్న వాడితో - ఆర్ధికంగా బాగ లేకనా?  కులాంతరమనా? ఆందరికీ తెలిసిన రామాయణమే. 

ఇక మరో ఈ పరువు హత్య పై తీవ్రాతి తీవ్రంగా స్పంధించిన మరో సినిమా బాబు గారి కుటుంబీకుడు కూడా కులాంతర వివాహమే చేసుకున్నాడు. అక్కడ వారి ఆర్ధిక స్థాయి కుటుంబ స్థాయి మామూలు కాదు కదా! మరి వారి సోదరి అలాంటి వివాహమే చేసుకోబోతే,  అప్పుడేం జరిగిందో? కూడా జగమెరిగిన సత్యమే కాదు, జనం నోళ్లలో నానే నిజం కూడా! ఎవరికి తెలియని బాగోతాలు ఇవి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగిన కుటుంబాల్లో కులాంతర వివాహాలు విరివిగానే జరుగుతున్నాయి. బాగా ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చి, ఆమె అప్సరస కాకపోయినా, అనాకారైనా, విపరీత వయోభేదమున్నా వీరి అబ్బాయిలకు వివాహాలు చేస్తున్నారు.  అదే వీరింటి అమ్మాయిలను, వేరే అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్థిరపడని వాళ్లు ప్రేమించినా, ఒకవేళ కులాంతర వివాహాలు చేసుకున్నా నానా రచ్చలు రభసలు అయిపోలేదా?.


ఇప్పుడు అలాంటి అమ్మాయిల సోదరులు, వారి ధర్మపత్నులే పరువు హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ల ఇళ్లల్లో ఆ వ్యవహారాలు జరిగినప్పుడు వీళ్లు ఇంతే విశాల హృదయంతో స్పందించారా? తమ సోదరీమణుల భర్తలపై ఈ స్థాయి లో సానుభూతి చూపించారా?  "చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేది ...?  చెప్పేటందుకె నీతులు ఉన్నాయి” అని అందుకే అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: