రామ్‌చరణ్ తేజ్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రంగస్థలం జాతర స్టార్ట్ అయ్యింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా కోసం అభిమానుల హంగామా గురువారం అర్ధరాత్రి నుంచే స్టార్ట్ అయ్యింది. రామ్‌చరణ్ ధృవ తర్వాత యేడాదిన్నర పాటు లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో మెగా అభిమానులు అయితే భారీ ఎత్తున అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు.
ఎప్పుడు షో పడుతుందా ? ఎప్పుడు సినిమా చూసేస్తామా ? అని ఆతృతతో వీరంతా వెయిట్ చేస్తున్నారు. ఇక సోలోగా రిలీజ్ అవ్వడం కూడా రంగస్థలంకు బాగా కలిసి రానుంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.80 కోట్లకు అమ్ముడవ్వడంతో నిర్మాతలు కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రంగస్థలంను వరల్డ్‌వైడ్‌గా 1800కు పై చిలుకు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
ముందుగా రంగస్థలంను 1700 థియేటర్లలో ప్లాన్ చేశారు. అయితే తర్వాత సోలో రిలీజ్ కలిసి రావడంతో మరిన్ని స్క్రీన్లను అదనంగా యాడ్ చేశారు. శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ స్క్రీన్లతో పాటు, సింగిల్ స్క్రీన్లు, మల్టీఫ్లెక్స్‌లోనూ కూడా ఈ సినిమానే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సినిమాలో మరో పాటను ఇప్పటి వరకూ రిలీజ్ చేయలేదు. ప్రేక్షకులకు ఇదో సర్‌ప్రైజ్.
ఇక సమంత ఈ సినిమాలో చాలా స్పెషల్ రోల్‌లో నటించనుంది. కెరీర్ ప్రారంభించి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు ఇలాంటి పాత్రను సమంత చేయలేదు. చాలా సహజంగా, ఒక పల్లెటూరు అమ్మాయిగా సమంత ఈ చిత్రంలో కనిపించబోతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు సినిమాను అప్పుడే సగం సక్సెస్ చేశాయి. రంగస్థలం చిత్రం షూటింగ్ కోసం ఒక భారీ పల్లెటూరు సెట్ వేశారు. సినిమాలో చాలా పార్ట్ , సీన్లు సహజత్వంకు దగ్గర ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడి పల్లెటూరులో తెరకెక్కించారు. మరి రంగస్థలం పూర్తి రిజల్ట్ ఎలా ఉందో మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.