తెలుగు తెరపై ఎప్పుడు పరభాషా హీరోయిన్ల ఆధిపత్యమే.. ఇది చాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమే. కానీ ఇప్పుడో మార్పు చోటుచేసుకుంటోంది. గతంలో ఈ ఆధిపత్యం ముంబై భామలది ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్లేసును మళయాళీ భామలు భర్తీ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఫిదా, ఎంసీఏ వంటి సినిమాల్లో సాయిపల్లవి ఎంత హడావిడి చేసిందో అందరికీ తెలిసిందే. సాయిపల్లవి ఫిదా సినిమాలో ఏకంగా తన సొంత గొంతుతో సంభాషణలు పలికి తెలుగు అమ్మాయిలా కలిసిపోయింది.
మరో ముద్దుగుమ్మ నివేతా థామస్ కూడా బాగానే దూసుకొచ్చేసింది. సంఘర్షణ సినిమాతో పరిచయమై నాని పక్కన మొదట జెంటిల్‌మెన్‌తో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత అదే హీరోతో నిన్నుకోరి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించింది. నానితో పోటీపడి నటించి మార్కులు కొట్టేసింది.
ఇక మరోభామ అనుపమా పరమేశ్వరన్ సంగతి చెప్పనక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో పరిచయం అయినా ఆ తర్వాత శతమానం భవతితో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది.
అదే బాటలో కీర్తి సురేశ్ కూడా మంచి పేరు సంపాదించుకుంటోంది. ఎక్స్ పోజింగ్ కు అవకాశం ఇవ్వకుండానే మంచి పాత్రలు రాబట్టుకుంటోంది.
ఇంకా అను ఇమాన్యుయేల్, కేథరిన్ థెరీసా ఇలా చెప్పుకుంటూ పోతే మళయాళీ భామల దండయాత్ర ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కదా.