పాపం.. గంటల్లో లక్షన్నర కోట్లు పోగొట్టుకున్నాడు?

Chakravarthi Kalyan
వ్యాపారంలో లక్ష రూపాయలు నష్టం వస్తేనే నెలంతా బాధపడతారు కొందరు. అలాంటిది.. ఏకంగా లక్షన్నర కోట్లు.. అదీ కొన్నిగంటల్లోనే కోల్పోతే ఎలా ఉంటుంది.. పాపం.. ఇప్పుడు అలాంటి కష్టమే వచ్చింది అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు. అవును.. ఆయన సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 20.5 బిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీ లెక్కలో చూస్తే రూ.1.56 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఎందుకు అంటారా.. ఆయన అమెజాన్ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అమెజాన్‌  షేరు ఒక్కరోజులోనే  14.05 శాతం పడిపోయింది. ఈ షేర్ ఇప్పుడు 2,485.63 డాలర్ల వద్ద స్థిరపడింది.

మరి ఎందుకు ఇంతగా ఈ షేర్ పడిపోయందంటే.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్‌ ఫలితాలు అంత బాగా లేవు. దీంతో మదుపర్లు నిరాశకు గురయ్యారు. అంతే.. షేర్లపై అమ్మకం ఒత్తిడి పెరిగింది. దాంతో  2015 తర్వాత కంపెనీ అమెజాన్ కంపెనీ తొలిసారి నష్టాల్ని నమోదు చేసుకుంది. అంతే కాదు.. వరుసగా 21 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ సంస్థ అమ్మకాల వృద్ధి నెమ్మదించింది.

ఈ పరిణామాలన్నీ అమెజాన్ కంపెనీ షేర్లు భారీ పతనం అయ్యేందుకు కారణం అయ్యాయి. ఈ అమెజాన్‌ కంపెనీలో జెఫ్‌ బెజోస్‌కు 11.1 శాతం వాటా ఉంది.  జెఫ్‌ బెజోస్‌ సంపదలో అధిక వాటా అమెజాన్ షేర్లదే అని చెప్పుకొవచ్చు. అమెరికాలో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ లెక్కల ప్రకారం జెఫ్‌ బెజోస్‌ సంపద 148 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే.. శుక్రవారం ఒక్కరోజే తన సంపదలో  12 శాతం పతనం చూశాడన్నమాట.

శుక్రవారం నాటి నష్టాలతో కలుపుకొని ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జెఫ్‌ బెజోస్‌ సంపద 43 బిలియన్‌ డాలర్లు తగ్గింది. షాకింగ్ ఏంటంటే.. ఇంత తగ్గినా ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో తన స్థానంలోనే ఉన్నారు. ఈ జాబితాలో ఆయనది రెండో స్థానం. ఫస్ట్ ప్లేస్ ఎవరో తెలుసుగా. అవును ఎలాన్ మస్క్.. ఆయన 249 బిలియన్‌ డాలర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్‌ వ్యాపారంలో అమెజాన్ 1.28 బిలియన్‌ డాలర్ల ఆపరేటింగ్‌ నష్టాల్ని మూటగట్టుకుంది. అందుకే మార్చి త్రైమాసికంలో అమెజాన్‌ నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: