డబ్బే డబ్బు : పుంజుకుంటున్న భారత్ పెరిగిపోతున్న ద్రవ్యలోటు !
భారత ఆర్ధిక వ్యవస్థ అంచనాలకు మించి ఈ కరోనా పరిస్థితులలో కూడ పుంజుకుంటూ ఉండటంతో భారత్ ప్రస్తుత కరోనా పరిస్థితులను అధికమించి ముందడుగు వేస్తోంది అన్న ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా పరిస్థితులు వల్ల జీడిపి క్షీణత మరీ భారీగా ఉంటుంది అన్న అంచనాలను కొంతవరకు తలక్రిందులు అయ్యాయి.
ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితులలో కూడ తయారీ రంగం కొంతవరకు వృద్ధి నమోదు చేసుకుంది. స్థిరాస్థి సేవల రంగం క్షీణించినా వ్యవసాయ రంగం ఈ కరోనా పరిస్థితులలో కూడ తన వృద్ధిని కొనసాగించడంతో పల్లెవాసులు పట్టణ ప్రజలు భయపడినంతగా కరోనాకు భయపడలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ద్రవ్యలోటు మరింత పెరిగి 9.53 లక్షలకు చేరుకోవడం కొంతవరకు కలవరపాటును కలిగిస్తోంది.
ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలు తగ్గడంతో ఈ ద్రవ్యలోటు పెరిగింది అంటున్నారు. ముఖ్యంగా సహజ వాయువు క్రూడాయిల్ రిఫైనరీ ఉత్పత్తులు నిరాశాజనక తీరును ప్రదర్శించడంతో జీడిపి క్షీణత వచ్చి ద్రవ్యలోటు పెరిగింది అంటున్నారు. అయితే ఈ కామర్స్ కంపెనీలకు ఈకరోనా సమయం పండుగగా మారింది. గతనెల 15 నుండి ఈనెల 15 వరకు కేవలం 30 రోజులలో ఆన్ లైన్ సంస్థల స్థూల విక్రయాలు 58 వేలకోట్ల స్థాయిలో జరగడంతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది.
అయితే వరసగా 8వ నెల కూడ ఉత్పత్తి రంగంలో క్షీణత ఏర్పడింది అని వచ్చిన అంచనాలతో షేర్ మార్కెట్ కుదుపులకు లోనైంది. ఇదే పరిస్థితి కొంతవరకు వచ్చేవారం కూడ కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా భారత వైద్య పరిశోధనా మండలి లేటెస్ట్ గా చేసిన సర్వేలో దేశ జనాభాలో 7 శాతం మందికి ఆగష్టు నాటికే కరోనా వ్యాధి సోకిందని సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే రెండు నెలలలో దేశ జనాభాలో 50 శాతం మందికి కోవిడ్ సోకే అవకాశం ఉంది అంటూ తెలియచెప్పే ఒక సర్వే వివరాలు బయటకు రావడంతో షేర్ మార్కెట్ వచ్చే వారం మరింత ఒడుదుడుకులకు లోనయ్యే ఆస్కారం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..