'గేమ్ ఛేంజర్' పై రామ్ చరణ్ అసంతృప్తి.. కారణం అతనేనా..?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక మిగతా భాగం షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మూవీ టీం ఇప్పటికే ప్లాన్ చేసుకుంటుంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో వైరల్ అవుతుంది. 

అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ సజావుగా సాగడం లేదట. దానికి కారణం దర్శకుడు శంకర్ కమలహాసన్ 'ఇండియన్ 2' మూవీ ని తెరకెక్కిస్తుండటమే. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ అనుకోని కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో శంకర్ ఈ సినిమాని ముందు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. దానికోసం రామ్ చరణ్ సినిమాకి బ్రేకులు వేశాడు. ఇదే విషయంలో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇండియన్ 2 సెట్స్ పైకి రాకముందే రామ్ చరణ్ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని శంకర్ మొదట అనుకున్నాడు.

కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ సినిమాను పక్కనే పెట్టేసి ఇండియన్2 పై శంకర్ ఆసక్తి కనబరుస్తుండడం గమనార్హంగా మారింది. అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేకులు పడడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు శంకర్ ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కాబట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా వేసవి కానుకగా సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: