తారకరత్న ఆరోగ్యం పై ఎన్టీఆర్ ఆరా.. స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి మరీ..?

Anilkumar
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి హీరో తారకరత్న గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారకరత్నకు కుప్పంలోని పి ఈ ఎస్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు తారకరత్న గుండెకు స్టంట్ వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అతని సోదరుడు టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా నందమూరి బాలకృష్ణ కు ఫోన్ చేశారు. ఈ మేరకు తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందో స్వయంగా బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్న బాలకృష్ణ తారకరత్న ఆరోగ్యం గురించిన సమాచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ కి అందించారు.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పినట్లు బాలయ్య ఎన్టీఆర్కు వివరించారు. ఎన్టీఆర్ తో పాటు తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్ చేసి భర్త ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది గంటల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నారా లోకేష్ యువ గళం పేరిట పాదయాత్రను చేపట్టారు. ఈరోజు ఉదయం 11 గంటల మూడు నిమిషాలకు ఈ యాత్ర మొదలైంది. టిడిపి కార్యకర్తలతో కలిసి లక్ష్మీపురం వరదరాజ స్వామి ఆలయంలో నారా లోకేష్ స్వయంగా పూజలు నిర్వహించారు. దాని అనంతరం తన పాదయాత్రను ప్రారంభించారు.
ఇక లోకేష్ కు మద్దతుగా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న కూడా లోకేష్ పాదయాత్రకు మద్దతు తెలియజేయడానికి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అది గమనించిన వాలంటీర్లు ఆయన్ను వెంటనే కుప్పం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పిఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నారు. మరోవైపు అత్యవసర చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకి తరలించే అవకాశం ఉందని అంటున్నారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం తారకరత్నను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించనున్నట్లు సమాచారం వినిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: