సత్యనారాయణ గారి పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక యంపీగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను– మచిలీపట్నం యంపీ బాలశౌరి

Anilkumar
టాలీవుడ్ సీనియర్ లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 23 శుక్రవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కైకాల గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక కైకాల భౌతికకాయాన్ని సందర్శించడానికి ఈరోజు మహాప్రస్థానానికి చేరుకొని వారికి నివాళులు అర్పించారు ఎంపీ బాలశౌరి, టీటీడీ బోర్డు సభ్యులు దాసరి కిరణ్ కుమార్. 

ఇక నివాళి అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.." తెలుగు సినీ పరిశ్రమలో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలు అనే తారతమ్యాలు లేకుండా దాదాపు 6 దశాబ్దాలుగా నటుడిగా తన సేవలను అందించారు కైకాల సత్యనారాయణ గారు. అలాంటి నటులు గతంలో ఎస్వీ రంగారావు గారు ఉండేవారు. తర్వాత కైకాల సత్యనారాయణ గారు తన నటనతో ఆయన లేని లోటును భర్తీ చేశారు దాదాపు.దాదాపు 770 చిత్రాలకు పైగా నటించిన చాలా తక్కువ మంది నటీనటుల్లో కైకాల సత్యనారాయణ గారు ఒకరు. సినీ పరిశ్రమలో కానీ రాజకీయంగా కానీ ఆయనకి ఉన్నతమైన వ్యక్తిగా ఎంతో మంచి పేరు ఉంది. వ్యక్తిగతంగా నాకు కైకాల గారితో మంచి పరిచయం ఉంది. నిన్న కైకాల గారి మృతి పట్ల చిరంజీవి గారు కూడా స్పందించి ఎంతో చక్కగా మాట్లాడారు. వారితో అనుబంధం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. కైకల గారి స్వగ్రామం కైతవరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి సాయం చేస్తాను.

గుడివాడలో కైకాల సత్యనారాయణ కళాక్షేత్రం అని ఉంది. ఆ కళాక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపే విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను" అని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు కైకాల గారి భౌతిక కాయాన్ని చితి వరకు మోసుకుంటూ వెళ్లి ఆయనకు తుది నివాళులు అర్పించారు ఎంపీ బాలశౌరి. ఇక ఆయనతోపాటు సినీ నిర్మాత అల్లు అరవింద్, టీటీడీ బోర్డు మెంబర్ దాసరి కిరణ్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకుడు త్రినాధరావు నక్కిన, నిర్మాతలు ఏడిది రాజా, పి సత్యారెడ్డి, మాదాల రవి, ప్రజా గాయకుడు గద్దర్, ఎర్రబెల్లి దయాకర్ రావు,  నటి ఈశ్వరి రావు, శివకృష్ణ, రాజవన్నెం రెడ్డి తదితరులు కైకాల గారికి నివాళులు అర్పించారు. ఇక మహాప్రస్థానంలో చివరగా ఆయన చితికి పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అశ్రునయానాలతో నిప్పంటించగా.. ప్రభుత్వ లాంఛనాలతో మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి కైకాల సత్యనారాయణ గారి అంతిమ సంస్కారాలని గౌరవంగా ముగించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: