కాంతార తో ఎలర్ట్ అయిన టాలీవుడ్ !

Seetha Sailaja
‘కాంతార’ ఒక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఆమూవీకి కోట్లాది రూపాయలతో కలక్షన్స్ రావడం చూసి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది. అంతేకాదు ఇలాంటి సహజత్వంతో కూడిన కథలు తెలుగు సినిమాలలో ఎందుకు రావడం లేదు అన్న చర్చలు కూడ జరుగుతున్నాయి.

వాస్తవానికి ఇలాంటి సినిమాలను  తెలుగు ప్రేక్షకులు ఆదరించరు అన్న ప్రచారానికి ‘కాంతార’ విజయం చెక్ పెడుతోంది. ఈమూవీ తెలుగు రాష్ట్రాల నేటివిటీతో ముడిపడ్డ సినిమా కాదు. కర్ణాటకలోని మారు మూల పల్లెల్లోని వన దేవతలు ఆ దేవతల ముందు నాట్యం చేసే భూత వైద్యులు నృత్యకారుల చుట్టూ తిరిగే కథ. అయితే ఆప్రాంత కథను కన్నడ ప్రేక్షకులు ఆదరించడం సహజమే కానీ అలాంటి సంస్కృతి మన తెలుగు ప్రేక్షకులకు ఎలా నచ్చింది అని తలలుపండిన వారు కూడ ఆశ్చర్యపోతున్నారు.

అయితే కథ ఏప్రాంతానికి సంబంధించింది అయినప్పటికీ ఆ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీయగలిగితే ఎలాంటి కథ అయినా సూపర్ హిట్ అవుతుంది అన్నవిషయం ‘కాంతార’ విజయం ఋజువు చేస్తోంది. వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల పల్లెటూళ్ళలో కూడ ఆ గ్రామాల్లో జరిగే జాతరలు వేడుకలు వాటి వెనుక ఎన్నో కథలు ఉంటాయి. ప్రాధాన్యం కోల్పోయిన గ్రామీణ కళల గురించి అర్థం చేసుకుని వాటిని అందంగా తెరపైన చూపిస్తే మన తెలుగు ప్రేక్షకులకు కూడ ఇలాంటి సినిమాలు నచ్చుతాయి అన్నవిషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మన రచయితలు విదేశీ చిత్రాల సీడీలు చూసి కథలు వ్రాస్తున్న పరిస్థితులలో ఇలాంటి కథలను వ్రాయాలి అంటే హీరోలను బట్టి కమర్షియల్ లెక్కలేసుకుని స్క్రిప్టులు వ్రాసే పద్ధతి మార్చుకోవాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

క్షేత్రస్థాయికి వెళ్లి పరిశోధన చేస్తే కొత్త కథలు వాటంతట అవే పుట్టుకు వస్తాయి. నిజానికి ‘కాంతార’ కథను ఆమూవీ దర్శకుడు రిషబ్ సుకుమార్ ‘రంగస్థలం’ చూసి ప్రేరణతో తీసాను అని చెపుతున్నాడు. ఇది ఒకవిధంగా తెలుగువారు గర్వించే విషయం. ఈ స్పూర్తితో తెలుగులో మరిన్ని మంచి సినిమాలు వస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: