12 ఏళ్ల తర్వాత కాలేజీ బాట పట్టిన మెగా పవర్‌స్టార్..!!

N.ANJI

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ఫుల్ జోష్‌లో నడుస్తోంది. ప్రస్తుతం విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఆల్ టైం హిట్ అందుకుంటోంది. థియేటర్లలో భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా.. మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌ నటించారు. కాగా, రామ్ చరణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఇటీవల రామ్ చరణ్ ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ కాలేజీకి ప్రిన్సిపల్ ఎవరో కాదు.. దర్శకుడు శంకర్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.


ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ అమృత్‌సర్‌లో జరగనుంది. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. ఇందులో స్టూడెంట్ పాత్రతోపాటు ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని ఫిల్మ్‌ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా 1930 సమయంలోని ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. అలాగే ఈ సీన్‌లో హీరోయిన్ అంజలి కనిపిస్తారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు తమన్ స్వరాన్ని అందించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, 2010లో వచ్చిన ‘ఆరెంజ్’ సినిమాలో రామ్ చరణ్ స్టూడెంట్ పాత్రలో నటించారు. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత కాలేజీ వెళ్తున్నారన్నమాట. కాగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ ఫుల్ లెన్త్ పాత్ర కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: