కాకా ప‌ట్టినా పూరీకి మ‌హేష్ చాన్స్ ఇవ్వ‌డం లేదుగా..?

అప్ప‌టిదాకా ప్రిన్స్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకున్న‌ మ‌హేష్‌కు సూప‌ర్‌స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం పోకిరి. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. హీరోల్లో దాగి ఉన్న‌ మాస్ ఎలిమెంట్స్‌ను బ‌య‌ట‌కు తీయ‌డంలోనూ వాటిని అభిమానులకు వెర్రెక్కించేలా స్క్రీన్‌పై ప్ర‌జంట్ చేయ‌డంలోనూ పూరీ శైలే వేరు. ఆ త‌రువాత చాన్నాళ్ల‌కు బిజినెస్ మేన్ చిత్రంతో మ‌రో సూప‌ర్ హిట్‌ను కూడా మ‌హేష్ ఖాతాలో వేశాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత స‌క్సెస్‌లు దూరం కావ‌డంతో ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పెద్ద హీరోల కాల్షీట్ల‌ను మాత్రం సంపాదించలేక‌పోతున్నాడు. మ‌ధ్య‌లో బాల‌కృష్ణ‌తో తీసిన పైసా వ‌సూల్ కూడా అత‌డి ఫేట్ ను మార్చ‌లేక‌పోయింది. అయితే రామ్ హీరోగా తానే నిర్మాత‌గా రూపొందించిన ఇస్మార్ట్ శంక‌ర్‌తో చాలాకాలం త‌రువాత మ‌రో స‌క్సెస్ రుచి చూశాడు పూరీ.ఈ సినిమా విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాల్లో త‌న‌కు క‌ష్ట‌కాలంలో త‌న‌ను నిరూపించుకునే అవ‌కాశం ఇవ్వ‌ని స్టార్ హీరోల‌ను ముఖ్యంగా మ‌హేష్‌ను ప‌రోక్షంగా నిష్టూర‌మాడాడు కూడా. కానీ స్టార్ హీరోల‌కు ఉండే ప‌రిమితులేంటో అత‌డికి తెలియ‌నివేం కాదు.


ఎప్పుడో శ్రీమంతుడు సినిమా స‌మ‌యంలో మ‌హేష్‌తో మ‌ళ్లీ సినిమా తెర‌కెక్కించేందుకు వేచి చూస్తున్నాన‌ని చెప్పాడు పూరీ. ఆ సినిమాలో త‌న పోకిరీ చిత్రంలోని ఎవ‌డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అన్న డైలాగ్ స్ఫూర్తితో వాడే నామొగుడు అనే పాట ఉంటుంది. ఆ మొగుడి కోసం నేనూ వెయిటింగ్ అంటూ పూరీ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. అయితే అదే స‌మ‌యంలో కెరీర్‌లో ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ వంటి ఫెయిల్యూర్‌లు రావ‌డంతో మ‌హేష్ పూరీని వెయిటింగ్‌లోనే ఉంచేశాడు. మ‌హేష్ స‌ర్కారువారి పాట చిత్రం త‌రువాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి భారీ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో పూరీ కోరిక తీరేందుకు మ‌రికొంత‌కాలం వేచిచూడ‌క త‌ప్పేట్టులేదు. ఒక‌వేళ ఈ కాంబో క‌నుక మ‌ళ్లీ సెట్ అయితే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించే స్థాయిలో క‌సిగా ప‌ని చేస్తాన‌ని, దానికి త‌గ్గ క‌థ ఇప్ప‌టికే సిద్ధం చేసుకున్నాన‌ని పూరీ ఇప్ప‌టికే స‌న్నిహితుల‌తో చెపుతున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో ఎప్ప‌టినుంచో టాక్ వినిపిస్తోంది. మ‌రి వీరిద్ద‌రి కాంబోలో హ్యాట్రిక్ మూవీ ఎప్ప‌టికి సాధ్య‌మ‌వుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

GMB

సంబంధిత వార్తలు: