ఆర్యన్ ఖాన్ కు షాక్ ఇచ్చిన కోర్టు

Vimalatha
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయనను ఎన్సిబి అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఆర్యన్ ఖాన్ తో పాటు ఆయన కుటుంబానికి కూడా షాక్ తగిలిందని చెప్పాలి. బెయిల్ పై ఈరోజు ఆర్యన్ బయటకు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోర్టు అతని బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. అంతే కాకుండా ఈ కేసులో ఆర్యన్ ఖాన్ అతని స్నేహితుల రిమాండ్ అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఇప్పుడు మూడు రోజుల పాటు అరెస్ట్ అయిన వారిని డ్రగ్స్ కోణంలో మరింత లోతుగా ప్రశ్నించబోతున్నారు అధికారులు.
అయితే విచారణ సమయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు ఆర్యన్ మొబైల్లో షాకింగ్ ఫోటోలు, సమాచారం దొరికాయని అంటున్నారు. ఈ కారణంగానే డ్రగ్స్ రాకెట్ పై దర్యాప్తు చేయడానికి అవసరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్యన్ కస్టడీని పొడిగించాలని కోర్టుకు నివేదించింది ఎన్సిబి. ఈ క్రూయిజ్ పార్టీకి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా తో సంబంధాలు ఉన్నాయని, డ్రగ్స్ తీసుకోవడానికి కోడ్స్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులందరినీ అక్టోబర్ 11 వరకు కస్టడీకి పంపించాలని డిమాండ్ చేశారు. అయితే కోర్టు ఎన్సిబి కి అక్టోబర్ 7 వరకు మాత్రమే రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.
మరోవైపు ఆయన తరపు న్యాయవాది సతీష్ మానేషిండే కూడా ఆర్యను సమర్ధిస్తూ వాదించారు. అధికారులు రైడ్ జరిగిన సమయంలో ఆర్య దగ్గర ఎలాంటి నిషేధిత వస్తువులు దొరకలేదని, ఆయన కేవలం ఆ పార్టీకి అతిథిగా మాత్రమే వెళ్లాడని, కనీసం బోర్డింగ్ పాస్ కూడా లేదని వాదించారు. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఏ నార్లికర్ ఈ కేసును విచారించారు. కాగా Ndps చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం మత్తు పదార్థాల వినియోగం, 8 సి మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, స్వాధీనం, కొనుగోలు లేదా అమ్మకంలతో పాటు ఇతర సెక్షన్ల కింద ఆర్యన్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. మరి విచారణలో ఏం వెలుగులోకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: